ఆస్కార్స్‌లో నామినేషన్ పొందిన 'జై భీమ్', 'మరక్కార్'
on Jan 21, 2022
సూర్య కీలక పాత్ర పోషిస్తూ నిర్మించగా 2021 నవంబర్‌లో డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన 'జై భీమ్' మూవీ విశేష ఆదరణ పొందడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందింది. టి.జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనేక చర్చలకు కూడా కేంద్రంగా నిలిచింది. ఆ మూవీ ఇప్పుడు 2022 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడేందుకు అర్హత సాధించింది. 'జై భీమ్'తో పాటు మోహన్‌లాల్ టైటిల్ రోల్ పోషించిన మలయాళం సినిమా 'మరక్కార్' కూడా షార్ట్‌లిస్ట్ అయ్యింది. ఫైనల్ నామినేషన్ లిస్టును ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు.
ఇరులర్ అనే గిరిజన తెగకు చెందిన కొంతమందిని పోలీసులు స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి, వారిలో ఒకరిని హత్య చేయడంతో, బాధితులకు న్యాయం చేయడానికి వారి తరపున కోర్టులో వాదించే లాయర్‌గా 'జై భీమ్'లో నటించాడు సూర్య. పోలీసుల దాష్టీకానికి భర్తను కోల్పోయి, న్యాయం కోసం పరితపించే యువతిగా లిజోమోల్ జోస్, ఆమె భర్తగా మణికందన్ నటించారు.
Also read: చైతూతో విడాకుల పోస్ట్‌ను తొలగించిన సామ్.. ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?
ఇక ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన 'మరక్కార్' మూవీ ఇప్పటికే 3 జాతీయ అవార్డులను పొందింది. 16వ శతాబ్దపు కాలికట్ నేపథ్యంలో కుంజలి మరక్కార్ కథతో తయారైన ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు కీర్తి సురేశ్, అర్జున్, సునీల్‌శెట్టి, మంజు వారియర్, కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు చేశారు.
Also read: నాన్నగారి కోసం టిఫిన్ తీసుకువచ్చే రోజులు గుర్తుకువస్తున్నాయి!
ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కోసం 276 సినిమాలు షార్ట్‌లిస్ట్ కాగా, మనదేశం నుంచి ఎంపికైన సినిమాలు 'జై భీమ్', 'మరక్కార్' మాత్రమే. జనవరి 27న ఆస్కార్ నామినేషన్ ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 8న ఫైనల్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. హాలీవుడ్‌లో మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
