మెగాస్టార్ హిట్ సినిమాకు సీక్వెల్ తీశాక రిటైర్ అవుతా!
on May 7, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సూపర్ క్లాసిక్ సినిమాలలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తప్పకుండా ఉంటుంది. చిరంజీవి-శ్రీదేవి కెమిస్ట్రీతో పాటు ఇద్దరి నటన, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు దర్శకత్వం, ఇళయరాజా పాటలు, అశ్వనీదత్ నిర్మాణ విలువలు... సినిమాలో అన్నీ అద్భుతాలే. మే 9వ తేదీకి ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో "కచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. మా జగదేకవీరుడు మళ్ళీ సీక్వెల్ తీసిన తర్వాతే నేను రిటైర్ అవుతా. ఇందులో ఎవరు నటిస్తారనే ది త్వరలో చెబుతా" అని అశ్వనీదత్ అన్నారు.
ఇంతకుముందూ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ గురించి వార్తలు వచ్చాయి. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వి జంటగా నటిస్తున్నారని వినిపించింది. ఆ విషయమై అశ్వినీదత్ మాట్లాడలేదు. అయితే... దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమాలో ఒక సినిమా చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. నందినీరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందన్నారు.