"ఇద్దరం" సినిమా రివ్యూ!
on Jul 8, 2016
నటీనటులు: సంజీవ్, సాయికృప, రంగనాథ్ తదితరులు..
సాంకేతికవర్గం: సంగీతం: కిరణ్ శంకర్
ఛాయాగ్రహణం: ఎస్.జె.సిద్దార్థ్
మాటలు: టైమ్ నాని
నిర్మాణం-దర్శకత్వం: సుధాకర్ వినుకొండ
విడుదల తేదీ: 8/7/2016
హీరో మినహా అందరూ కొత్తవారితో ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం "ఇద్దరం". "వెల్ కమ్ ఒబామా" ఫేమ్ సంజీవ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సాయికృప కథానాయికగా పరిచయమవ్వగా.. సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ ఏమిటి? సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలుగుతుంది? వంటి విషయాలను సమీక్షలో చూద్దాం..!!
కథ:
అజయ్ (సంజీవ్) ఓ అనాధ. ఓ క్రీస్టియన్ మిషినరీలో పెరుగుతాడు. అక్కడే ఓ నలుగురు స్నేహితులను కూడా సంపాదించుకొంటాడు. కొంత మంది ప్రేమ మైకంలో చేసే తప్పు కారణంగా తమలాంటి అనాధలు పుడుతున్నారని భావించిన అజయ్ అండ్ గ్యాంగ్ వైజాగ్ పరిసరాల్లో "ఆ తప్పు"కు పాల్పడే ఉద్దేశ్యంతో వచ్చిన ప్రేమ జంటలకు బుద్ది చెబుతుంటారు.
అయితే.. అజయ్ కేవలం వారిని భయపెట్టాలనుకోగా, అతడి స్నేహితులు మాత్రం దొరికిన అమ్మాయిని బలవంతంగా అనుభవిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు.
కట్ చేస్తే.. ఒకరోజు తమకు ఎదురు తిరిగాడని అజయ్ ను కారుతో గుద్దేస్తారు అతడి స్నేహితులు. దాంతో గతం మర్చిపోయిన అజయ్ మూడు నెలలపాటు హాస్పిటల్ లో ఉండి డిశ్చార్జ్ అవుతాడు. ఆ తర్వాత తన గతాన్ని తవ్వుకొనే సమయంలో అతడికి ఊహించని నిజాలు తెలుస్తాయి. అజయ్ ను అతడి స్నేహితులు ఎందుకు చంపాలనుకొన్నారు ? కోమా నుంచి తేరుకొన్నాక అజయ్ తెలుసుకొన్న నమ్మలేని నిజాలేమిటి ? అనేది "ఇద్దరం" కథాంశం!
నటీనటుల పనితీరు:
హీరోగా నటించిన సంజీవ్ కు ఇదివరకే ఒక సినిమాలో నటించిన అనుభవం ఉండడంతో హావభావాల ప్రదర్శన బాలేకపోయినా.. ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించుకొన్నాడు. హీరోయిన్ గా నటించిన సాయికృప నటన మీద కంటే.. తన యద సంపదతో యువతను ఆకట్టుకోవడం మీద ఎక్కువ దృష్టి సారించడంతో నటన పరంగా బొటబొటి మార్కులు సైతం సాధించలేకపోయింది. దివంగత నటులు రంగనాధ్ గారు ఈ సినిమాలో హుందాగా నటించారు. మానవరాలిని పోగొట్టుకొన్న తాతయ్యగా, బ్రతికి ఉన్న మనవడి కోసం తాపత్రయపడే వ్యక్తిగా రంగనాధ్ గారు ఆయన సీనియారిటీని నిరూపించుకొన్నారు. డాక్టర్ పాత్రలో సూర్య అవసరమైన మేరకు నటన కనబరిచాడు. ఇక మిగిలిన నటీనటుల గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు అనేట్లుగా ఉంది వారి నటప్రతిభ.
సాంకేతికవర్గం పనితీరు:
కిరణ్ శంకర్ బాణీలు బాగున్నాయి. అయితే.. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఓల్డ్ క్లాసిక్ గా పేర్కొనబడే 'నిను వీడనే నీడను నేనే" పాటను రీమిక్స్ చేసి పాడుచేశారు. ఎస్.జె.సిద్దార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బానే ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మైనస్ అనే చెప్పాలి. సాంగ్స్ లో స్లైడింగ్ ఎఫెక్ట్ షాట్స్ తో దర్శకుడు తన ప్రతిభను చూపిద్దామనుకొన్నప్పటికీ.. కెమెరా వర్క్ సహరించకపోవడంతో అదీ సాధ్యపడలేదు. టైమ్ నాని రాసిన మాటలకి, సిట్యుయేషన్ కి సంబంధం ఏమిటో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. కొన్నిచోట్ల ప్రాసల కోసం పడిన ప్రయాస బెడిసికొట్టింది.
దర్శకనిర్మాత సుధాకర్ వినుకొండ "ఇద్దరం" సినిమా కోసం పడిన తపన ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అయితే.. "ఏదో చేద్దాం అనుకోని ఇంకేదో చేసినట్లు"గా ఉంటుంది సినిమా ఔట్ పుట్. ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేద్దామనుకొని.. తానే కన్ఫ్యూజ్ అయ్యాడు. సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే కథ ఏంటనేది తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత సాగదీసిన కథనం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హీరోయిన్ రన్నింగ్ సీన్స్ ను స్లోమోషన్ లో చూపించి ఎవర్ని సంతృప్తిపరుద్దామనుకొన్నాడో దర్శకుడికే తెలియాలి. ఫ్యామిలీ సెక్షన్ ఆడియన్స్ కు సదరు స్లో మోషన్ షాట్స్ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి.
విశ్లేషణ:
వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సినిమా తీద్దామనుకోవడం కరెక్టే, నేటితరం ఆడియన్స్ కూడా వైవిధ్యాన్నే కోరుకొంటున్నారు. కానీ.. ఆ వైవిధ్యంలో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు ఎంత డిఫరెంట్ ఎటెంప్ట్ చేసినా అది నీరుగారిపోవడం ఖాయం. "ఇద్దరం" బేసిక్ గా మంచి కాన్స్పెట్. అయితే.. ఆ కాన్సెప్ట్ ను రన్ చేసిన విధానం మాత్రం అస్సలు బాగోలేదు. సినిమాలోని ఏ ఒక్క క్యారెక్టరూ ప్రేక్షకులకు అర్ధం కాదు. కథలో ఏం జరుగుతుందో ముందే తెలిసినా.. అసలు అలా ఎందుకు జరుగుతుందో తెలియక తికమకపడుతుంటాడు ప్రేక్షకుడు. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ ఆ తికమకను చిరాకుగా మారుస్తుంది!
రేటింగ్: 1/5