"అంతం" సినిమా రివ్యూ!
on Jul 7, 2016
నటీనటులు: రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్
సంగీతం: కార్తీక్ రోడ్రిజ్
సినిమాటోగ్రఫి - ఎడిటింగ్ - విఎఫ్ఎక్స్ - డిఐ - స్టోరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
విడుదల తేదీ: 7/7/2016
హాట్ యాంకర్ రష్మీ ఆరబోసిన అందాలను పబ్లిసిటీ కోసం వాడుకొంటూ ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలెట్టిన సినిమాను పేరు మార్చి "అంతం" అంటూ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయం పక్కన పెడితే.. కేవలం రష్మీ అందాల ఆరబోతను చూడడానికే జనాలు థియేటర్లకు వచ్చారు. మరి "గుంటూరు టాకీస్" సినిమాలో తన అందాలతో పసందైన విందు భోజనం వడ్డించిన రష్మీ.. "అంతం" సినిమాలోనూ ఆదేస్థాయిలో రెచ్చిపోయిందా? లేదా? ప్రేక్షకుడు "అంతం" సినిమాను చూసి సంతృప్తి చెందాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...!!
కథ:
కళ్యాణ్ కృష్ణ (చరణ్ దీప్) ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఇష్టపడిన వనిత (రష్మీ గౌతమ్)ను పెళ్ళాడి సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. సుఖంగా సాగుతున్న ఈ జీవితంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశిస్తాడు. తాను చెప్పినట్లు చేయకపోతే వనితను చంపేస్తానంటాడు. దిక్కు తోచని పరిస్థితిలో పేరు కూడా తెలియని వ్యక్తి చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు కళ్యాణ్. అసలు కళ్యాణ్ తో పేరు లేని వ్యక్తి ఎందుకు ఆడుకోంటున్నాడు? అతడు కిడ్నాప్ చేసిన వనిత అక్కడ్నుంచి బయటపడిందా? కళ్యాణ్ కి ఆ పేరు లేని వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఆసక్తికరమైన ప్రశ్నలకు అత్యంత నిరాసక్తిగా చెప్పిన సమాధానాల సమాహారమే "అంతం" కథాంశం!
నటీనటుల పనితీరు:
సినిమా మొత్తానికి కనిపించేదే నలుగురు నటీనటులు. నలుగురూ నటన పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. హీరో చరణ్ దీప్ మొదలుకొని, ప్రతినాయక పాత్రలో కనిపించిన వాసుదేవ్, కమెడియన్ సుదర్శన్ ఇలా అందరూ హావభావాల పరంగా ప్రేక్షకుల్ని చిరాకుపెట్టినవారే. రష్మీ సినిమా మొత్తానికి ఒక "హాట్ సాంగ్" ఆఖర్లో ఒక ఫైట్ మినహా.. ముడుచుకొని కూర్చోవడం తప్పితే నటించడానికి పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ ఇది. ఆమెను కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే దర్శకుడు వినియోగించుకొన్నాడని సినిమా మొదలైన మొదటి పది నిమిషాల్లోనే అర్ధమైపోతుంది. అందుకు తగ్గట్లే రష్మీ చాలా పద్ధతిగా ఏమాత్రం మొహమాటపడకుండా ఎక్స్ పోజింగ్ లో రెచ్చిపోయింది. సుదర్శన్ తన నెల్లూరు యాసలో నవ్వించడానికి ప్రయత్నించినప్పటికీ.. కథలో పట్టు లేకపోవడం వల్ల ఆ పంచ్ లు పేలలేదు. వాసుదేవ్ ఎందుకు అరుస్తాడో, ఇష్టమొచ్చినట్లు రష్మీని ఎందుకు కొడతాడో ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన దర్శకుడు కళ్యాణ్ కే తెలియాలి.
సాంకేతికవర్గం పనితీరు:
బహుశా మన తెలుగు ఇండస్ట్రీలో కథ-స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫి - ఎడిటింగ్ - విఎఫ్ఎక్స్ - డిఐ వంటి టెక్నికల్ అంశాలను కూడా పర్యవేక్షించిన ఏకైక దర్శకుడు జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాత్రమే అనుకొంటా. మరి అన్నీ తానై ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసేసి.. క్రెడిట్ అంతా తానే కొట్టేయాలనుకొని కక్కుర్తి పడ్డాడో లేక బ్యాంకులో క్రెడిట్ బ్యాలెన్స్ లేక అన్నీ పనులూ తనే చేశాడో తెలియదు గానీ.. "అంతం" అవుట్ పుట్ మీద మాత్రం ఆ ఎఫెక్ట్ బాగా పడింది. కార్తీక్ నేపధ్య సంగీతం మొదలుకొని దర్శకుడు కళ్యాణ్ వెలగబెట్టిన సాంకేతికపరమైన విషయాలన్నీ సినిమాకి మైనస్ గానే మారాయి. కనీస స్థాయి లైటింగ్ ను మెయింటైన్ చేయకూండా పిక్చరైజ్ చేసిన నైట్ సీన్లు మొదలుకొని కార్ లోపల కెమెరా పెట్టి తీసిన సీన్లు "ఇది సినిమానా లేక షార్ట్ ఫిలిమా" అని ప్రేక్షకుడికి అనుమానం కలిగిస్తాయి. పరాయి మగాడు ఉచ్చ పోస్తుండగా.. బలవంతంగా అక్కడే కూర్చున్న రష్మీ చేత.. ఆ హేయమైన పనిని చూపించడంతోపాటు.. అతడి మర్మాంగాన్ని సైతం చూడమని బెదిరించే సన్నివేశం దర్శకుడి పైత్యానికి పరాకాష్టగా నిలుస్తుంది.
ఇక "గులాబీ" సినిమాలోని "ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు" అనే అద్భుతమైన పాటను రీమిక్స్ చేసి.. ఆ పాటను రొమాన్స్ చేస్తున్నారో లేక అంతకుమించిన హేయమైన పని మరోకటి చేస్తున్నారో అర్ధంకాని చర్య కోసం వాడడం బాధాకరం.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో వచ్చే ఒకే ఒక్క రోమాంటిక్ సాంగ్ లోని స్టిల్స్ ను పోస్టర్లుగా, ప్రోమోలుగా వినియోగించుకొని ప్రేక్షకులను బురిడీ కొట్టించి థియేటర్ వరకూ వారిని తీసుకురాగలిగాడు దర్శకుడు కళ్యాణ్. సినిమా మొదలైన 20 నిమిషాలకే తాము మోసపోయామని అర్ధం చేసుకొన్న ప్రేక్షకులు.. మిగతా 110 నిమిషాల సినిమాను ఎంతో ఓపిగ్గా చూసినప్పటికీ.. ఒక్కటంటే ఒక్క ఆసక్తికరమైన అంశం కూడా కనిపించదు. రష్మీ ఒక అయిదు నిమిషాల పాటలో చూపే అందాల స్వర్గాన్ని ఆస్వాదించడానికి వెళ్ళి.. మిగతా 125 నిమిషాల నరకాన్ని భరించడానికి ఓపిక ఉన్నవారు మాత్రమే "అంతం" సినిమా చూడాల్సిందిగా మా మనవి!
రేటింగ్: 1/5