"పునీత్ నన్నిప్పటికీ శివన్నా అని పిలుస్తున్నట్లే ఉంది".. శివ రాజ్‌కుమార్ భావోద్వేగం!
on Nov 29, 2021

సుమారు నెల రోజుల క్రితం కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆ నిజాన్ని పునీత్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబసభ్యులైతే ఒకవైపు ఈ విషాదాన్ని మోస్తూ, ఆయన మరణానంతర క్రతువులు శ్రద్ధగా చేస్తూ, ఆయన లేని లోటును భరించడానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
"ఇతర కుటుంబ సభ్యుల మాదిరిగానే నేను కూడా ఇప్పటికీ ఈ నిజాన్ని భరించలేకపోతున్నానని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను జీవితం క్షణభంగురమని భావించిన, నిజాన్ని అంగీకరించడానికి ప్రయత్నించిన క్షణాలున్నాయి. అలాగే ఇది జరిగిందని నమ్మడానికి నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. తను (పునీత్) ఇప్పటికీ నా పక్కనుండి శివన్నా అని పిలుస్తున్నట్లే అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే, ఇప్పుడు రోజులు ఎలా గడుపుతున్నానో నాకే తెలియడం లేదు." అని చెప్పారు శివ రాజ్‌కుమార్, చెమ్మగిల్లిన కళ్లతో.
Also read: 'నాటు నాటు' సాంగ్‌కు పునీత్ స్టెప్స్.. వీడియో వైరల్!
షూటింగ్ మాత్రమే మనసును రియాలిటీ నుంచి దూరం చేస్తుందని ఆయన అన్నారు. "కానీ, మళ్లీ ప్రతి మూలలో, నా అప్పు ఫొటో మెడలో దండతో నా వంకే చూస్తున్నట్లుగా కనిపిస్తుంటే నేనేం చెయ్యాలి? నేను తలతిప్పుకొని ఆ ఫొటోలను చూడకుండా ఉండానికి ప్రయత్నిస్తుంటాను. మరణం అనివార్యమని నాకు తెలుసు. ఏదో ఒకరోజు మా ఫొటోలన్నీ ఒకేవిధంగా గోడలపై కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఉంచింది నా చిట్టి తమ్ముడి ఫొటో అని చెప్పడానికి నా హృదయం ఒప్పుకోవట్లేదు. కాలం అన్ని గాయాల్నీ మాన్పుందని అంటారు. దాన్ని నేను నమ్మను. జనం కేవలం ఆ ఫీలింగ్‌తో జీవించడం నేర్చుకుంటారని నేననుకుంటున్నా. అతడ్ని నేను నా లోపలికి తీసుకొని నాతో పాటు తిప్పుకుంటున్నా. మేం చేయగలిగినంత అశ్విని (పునీత్ భార్య)కి, పిల్లలకు ప్రతి విషయంలోనూ చేయాలని అనుకుంటున్నాను." అని ఎమోషనల్‌గా చెప్పారు శివన్న.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



