విలక్షణతకు రూపమోస్తే విక్రమ్..
on Sep 8, 2016
నటుల్లో రెండు రకాలు..నటించేవారు కొందరైతే, జీవించేవారు కొందరు. ఆ రెండో రకం కిందకు వచ్చే వారిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తాడు విక్రమ్. ఒక పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తెగించేందుకు విక్రమ్ వెనుకాడడు..శివపుత్రుడు నుంచి ఐ వరకూ ఆయన నటించిన ఏ సినిమా అయినా తీసుకోండి..ఒక పాత్రకూ మరో పాత్రకీ, ఒక కథకూ మరో కథకూ ఏమాత్రం పోలికలుండవు. ఒకే సినిమాలో నాలుగైదు గెటప్పులతో అదరగొట్టడం విక్రమ్‌కే సాధ్యం. వెరైటీకి కేరాఫ్‌గా నిలిచిన విక్రమ్‌కి ఈ స్టేటస్ ఆకస్మాత్తుగా వచ్చింది కాదు. దాని కోసం అతను పడిన కష్టం అంతా ఇంతా కాదు. కెరిర్ ప్రారంభంలో చిన్న హీరోగా చిన్న పాత్రలే పోషించాడు. కెరిర్ స్టార్ట్ చేసి పదేళ్లైపోయింది..తనతో పాటు తన తర్వాత కెరిర్ స్టార్ట్ చేసిన చాలా మంది తనను దాటి వెళ్లిపోతుంటే వారిని మనస్పూర్తిగా అభినందించాడు.
సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు. ఒక వైపు గాత్రదానం చేస్తూనే అవకాశాల కోసం వెతికేవాడు. ఎన్నో ప్రయత్నాల ఫలితంగా చివరికి సేతు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌హిట్టై విక్రమ్ అంటే ఎంటో తెలియజేసింది. ఇక అప్పటి నుంచి చియాన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ వెంటనే క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడుతో విక్రమ్ స్టామినా ఏంటో భారతదేశం మొత్తానికి తెలిసింది. అటు తర్వాత మల్లన్న, రావణ్, నాన్న, ఐ సినిమాలు విక్రమ్‌కి మంచి పేరు తీసుకువచ్చాయి. సినిమాల్లో విలక్షణతకు ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు పాత్రల కోసం ఎంతైనా కష్టపడతాడు.
దానికి ఐ సినిమా పెద్ద ఉదాహరణ..ఆ సినిమాలో బాడీబిల్డర్‌గా, మోడల్‌గా, కురూపీగా కనిపించాడు విక్రమ్. సంవత్సరాల పాటు సాధన చేసినవారికే సాధ్యం కాని బాడీబిల్డింగ్ షేప్ కోసం రాత్రింబవళ్లు జిమ్‌లోనే గడిపి కేవలం మూడు నెలల్లోనే బాడీబిల్డర్‌గా మారాడు. దీని కోసం ఎలాంటి స్టెరాయిడ్స్ వాడలేదు. ఇదంతా ఒక ఎత్తైతే మోడల్ పాత్ర కోసం బాడీబిల్డర్ కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అందుకోసం కడుపు మాడ్చుకుని అనుకున్న రూపానికి మారాడు. కురూపీ పాత్ర కోసం గంటల తరబడి ఏ మాత్రం విసుగు పొందక మేకప్ వేయించుకునే వాడు . ఆయన కష్టం చూడలేక శంకర్ చాలాసార్లు ఇంతకష్టం అవసరమా అనేవారు..నా తృప్తి కోసం చేస్తున్నా అని చెప్పాడట విక్రమ్. అందుకే ఈ చియాన్‌ను అభిమానులు అంతలా అభిమానిస్తారు.
హీరో అంటే హిట్స్. స్టార్ అంటే అవార్డ్స్. ఇంతే అయితే బోలెడు మంది కనిపిస్తారు మనకి. కాని, విక్రమ్ వారి కోవలోకి చేరేవాడు కాదు. విక్రమ్ ఎవరు అంటే రేపటి తరం ఒక్కసారి ఆయన సినిమాల్ని చూస్తే చాలు! ఒక నటుడి విశ్వరూపం వెండితెరపై దర్శనమిస్తూ ఒళ్లు జలదరింపజేస్తుంది! అదే ఎవరికైనా శాశ్వత విజయం.... విక్రమ్ బాక్సాఫీస్ లకు, అవార్డ్స్ కు అందని ఆ విజయాన్ని అద్భుతంగా అందుకున్నాడు!