ఈ ఏడాది నిర్మాతల ఇంట కాసుల వర్షం కురిపించిన సినిమాలు
on Jan 1, 2018
2017... తెలుగు సినిమా రంగానికి లక్కీ ఇయర్. దాదాపు అందరు హీరోలకూ విజయాలందించిన సంవత్సరం ఇది. ఈ ఏడాదిలో నిర్మాణ పరంగానే కాదు.. వసూళ్ల పరంగా కూడా తెలుగు సినిమా పరిథులు దాటిపోయింది. తెలుగు సినిమా మార్కెట్ రెండొందల కోట్లకు చేరింది. వసూళ్ల పరంగా బాలీవుడ్ తోనే పోటీ పడుతోంది. దువ్వాడ జగన్నాథం, స్పైడర్ లాంటి ఫ్లాపులు కూడా వంద కోట్ల మార్క్ ను అందుకున్నాయంటే తెలుగు సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. ఈ ఏడాది ఏ సినిమాలు ఎక్కువ వసూలు చేశాయ్? అనడిగితే.. ఫ్లాప్ సినిమాలు కూడా లైన్లోకొచ్చే పరిస్థితి. అందుకే.. ఈ ఏడాది నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలేంటి? అనేది ఈ ఇయర్ రౌండప్ లో చూద్దాం.
1. బాహుబలి ది. కంక్లూషన్
ఈ సినిమా దేశవ్యాప్తంగా ఓ సంచలనం. ఓ ప్రాంతీయ చిత్రం 1750 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టడం సామాన్యమైన విషయమా? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండొందల కోట్ల పై చిలుకు షేర్ రాబట్టి ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ సినిమాకు నిర్మాతలు ఖర్చు చేసింది రెండొందల కోట్లు.
2. ఖైదీ నంబర్ 150
చిరంజీవి 150వ సినిమా ఇది. దానికి తగ్గట్టే 150 కోట్ల పై చిలుకు షేర్ రాబట్టింది. చిరంజీవి రీ ఎంట్రీకి ఓ గౌరవాన్ని తెచ్చింది. నాన్ ‘బాహుబలి’ సినిమాల్లో నేటికీ ‘ఖైదీ నంబర్ 150’నే వసూళ్ల పరంగా రికార్డ్. చిరంజీవి పారితోషికాన్ని కూడా కలుపుకొని ఈ సినిమాకైన ఖర్చు దాదాపుగా వంద కోట్లు. అంటే... 50 కోట్లకు పైగా నిర్మాతకు లాభాలు ఆర్జించిన పెట్టిన సినిమా ఇది.
3. ఫిదా
ఈ సినిమాకు అయిన ఖర్చు అక్షరాలా 13 కోట్లు. ఈ సినిమాకు వచ్చిన షేర్ దాదాపు 55 కోట్లు. దిల్ రాజు ఇంట కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది. తెలంగాణ నేటివిటీతో... స్వచ్ఛమైన ప్రేమతో కూడిన కుటుంబ కథగా శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా నిజంగా సంచలనమే.
4. అర్జున్ రెడ్డి
ఈ సినిమాకైన ఖర్చు దాదాపు 10 కోట్లు. ఈ సినిమా వసూలు చేసింది దాదాపు 45 కోట్లు. నిజమైన విజయం అంటే ఇదే. ‘చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండవ్. హిట్ అయితే... ఏదైనా పెద్ద సినిమానే’ అని రుజువు చేసిన సినిమా ఇది. విమర్శలు కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయ్.
5. గౌతమీ పుత్ర శాతకర్ణి
బాలకృష్ణ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ఇది. హిస్టారికల్ మూవీ అయినా.. ఖర్చు విషయంలో చాలా ఆచీ తూచి ముందుకెళ్లారు నిర్మాతలు. ఉన్నంతలో తాను పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. టోటల్ గా ఈ సినిమాకు అయిన ఖర్చు 40 కోట్లకు లోపలే. కానీ.. వసూళ్ల పరంగా చూస్తే... ఈ సినిమా గ్రాస్ వంద కోట్లకు చేరువైంది. నిర్మాతలు ప్రకటించిన షేర్ అక్షరాలా 79 కోట్లు. సగానికి సగం నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఇది.
5. నేను లోకల్
22 కోట్లు ఈ సినిమాకైన ఖర్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన మొత్తం 58 కోట్లు.. షేర్ 39 కోట్లు. సగానికి సగం దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెట్టిందీ సినిమా. ఇప్పటికీ నాని కెరీర్ లో వసూళ్ల పరంగా ‘నేను లోకల్’ నంబర్ వన్.
6. జై లవకుశ
నిజానికి ఈ ఏడాది వసూళ్లలో ఈ సినిమాది మూడో స్థానం. 129 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమాకు. దాదాపు 85 కోట్ల రూపాయల వరకూ షేర్ ఉండొచ్చు. కానీ బడ్జట్ లిమిట్స్ దాటడంతో.. నిర్మాతకు లాభం గూబలోకొచ్చింది. బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా ఘన విజయం సాధించింది. కానీ.. నిర్మాత పరంగా మాత్రం పూర్తి సంతృప్తినివ్వలేదనే చెప్పాలి.
వీటితో పాటు.. శతమానంభవతి, నిన్నుకోరి, రారండోయ్ వేడుక చూద్దాం, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక, మహానుభావుడు చిత్రాలు దాదాపు ఓ మోస్తర్ బడ్జెట్ తో తయారై దాదాపుగా 40 కోట్ల వసూళ్లని రాబట్టాయ్.
ఇవే గాక, ఈ ఏడాది చిన్న చిన్న విజయాలు చాలా ఉన్నాయ్. గురు, అమీ తుమీ, ఘాజీ, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, ఆనందో బ్రహ్మ... ఇవన్నీ విజయాలే.
నిజానికి ఇన్ని విజయాలు గత ఇరవై ఏళ్లలో తెలుగు సినిమా ఎరుగదు. అందుకే.. తెలుగు చిత్ర పరిశ్రమ 2017 నిజంగా ప్రత్యేకం ఏమంటారు?
మరో టాపిక్ తో వచ్చేవారం కలుద్దాం.