వెంకటేష్... ఓ అజాత శత్రువు!
on Dec 13, 2018
రాజకీయాల్లో మాత్రమే కాదు... సినిమా ఇండస్ట్రీలోనూ కోటరీలు, గ్రూపులు వుంటాయనేది జగమెరిగిన సత్యం! ఇదెంత నిజమో... ప్రేక్షకుల్లోనూ కొందరు కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా హీరోలను అభిమానిస్తారు అనేదీ అంతే నిజం!! ప్రజెంట్ సోషల్ మీడియా జమానాలో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలుగా మాటలతో కొట్టుకుంటున్నారు. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ ఎదుటి హీరోని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఓ హీరోను అభిమానించడానికి ప్రేక్షకులకు రకరకాల కారణాలు వుండొచ్చు. కానీ, విక్టరీ వెంకటేష్‌ని అభిమానించడానికి మాత్రం వున్న కారణం ఒక్కటే... ఆయన అజాత శత్రువు. ఇండస్ట్రీలో అందరివాడు. ప్రతి హీరో అభిమానీ వెంకీ అభిమాని అని చెప్పుకోవాలి. వెంకీని ద్వేషించే ప్రేక్షకులు టార్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడా కనిపించారు. సోషల్ మీడియాలో కొందరు హీరోలపై అదే పనిగా బురదజల్లే ప్రేక్షకులు సైతం వెంకీని అభిమానిస్తారు.
కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా వెంకీని ప్రేక్షకులంతా అభిమానిస్తారు. అదీ వెంకీ గొప్పతనం. ఓ రకంగా వెంకీలో మంచితనమే ఆయన్ను అందరికీ దగ్గర చేసింది. 'వెంకటేష్‌కి మహిళా అభిమానులు, కుటుంబ ప్రేక్షకుల్లో అభిమానులు ఎక్కువ' అని చెబుతుంటారు. ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేశారు కనుక... మహిళా అభిమానులు ఎక్కువ అనేది అలా చెప్పేవారి మాట! కుటుంబ ప్రేక్షకులు అంటే ఎవరు? ఫ్యామిలీలో చిన్న పిల్లలు, పెద్దలు అందరూ వస్తారు కదా! ఆ లెక్కన వెంకీకి ప్రతి ఒక్కరూ అభిమానులే.
వెంకటేష్ నటించిన సినిమాల గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాలూ చేశారు. 'లక్ష్మీ', 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' వంటి ఫ్యామిలీ సినిమాల తరవాత 'తులసి' అంటూ కత్తిపట్టి యాక్షన్ సినిమా చేశారు. తరవాత 'చింతకాయల రవి' అంటూ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేసి.. ఆ తర్వాత 'ఈనాడు' లాంటి థ్రిల్లర్ చేశారు. ఒక్క హారర్ తప్ప.. వెంకీ టచ్ చేయని జానర్ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదేమో! వెంకటేష్ సినిమాల కంటే ట్రెండ్‌ని బట్టి ఆయన సినిమాలు ఎంపిక చేసుకున్న తీరు గురించి మాట్లాడుకోవాలి. యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందడుగు వేసిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
వయసు రీత్యా కొన్ని కథలను తాను చేయలేనని ఇతర హీరోల కంటే వెంకటేష్ ముందే గ్రహించారు. నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అందమైన హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు కల సినిమాలను పక్కన పెట్టి కథాబలం వున్న సినిమాలకు ఓటు వేయడం మొదలుపెట్టిన సీనియర్ హీరోల్లో వెంకటేషే ఫస్ట్. 'దృశ్యం'లో ఇద్దరు అమ్మాయిలకు తండ్రిగా నటించడానికి వెంకటేష్ వెనుకంజ వేయలేదు. 'గురు'లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించడానికి ఆలోచించలేదు. వీటన్నిటికంటే ముందు 'మల్లీశ్వరి'లో పెళ్లికాని ప్రసాద్ పాత్రలో నవ్వించారు. ఏజ్ బార్ క్యారెక్టర్ చేయడానికి, మరో హీరోతో కలిసి తెరను పంచుకోవడానికి వెంకటేష్ ఎప్పుడూ అడ్డుచెప్పలేదు.దాంతో దర్శక రచయితలకు వెంకీని దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం సులువైంది. 'సంక్రాంతి', 'మసాలా', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గోపాల గోపాల' వంటి సినిమాలు వచ్చాయి. త్వరలో 'ఎఫ్ 2' రానుంది.
కథ నచ్చితే ఏ హీరోతో అయినా కలిసి నటించడానికి వెంకటేష్ సిద్ధమే. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రామ్... తెలుగు హీరోలు మాత్రమే కాదు. కమల్ హాసన్ వంటి తమిళ హీరోతోనూ వెంకటేష్ నటించారు. ఎప్పుడూ ఏ హీరో గురించి ఆయన చెడుగా మాట్లాడింది లేదు. ఆయనలో ఈ లక్షణాలే ఆయన్ను అందరూ అభిమానించేలా చేశాయి. విజయాలు అందించాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన విక్టరీ వెంకటేష్‌కి 'తెలుగువన్ డాట్ కామ్' తరపున జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే సార్!!