డిఫరెంట్ డైలాగ్ డిక్షన్‌తో అలరించిన కమెడియన్ సుధాకర్!
on May 18, 2021
నిజానికి సుధాకర్ కమెడియన్ కాదు. హీరో! అవును. భారతీరాజా లాంటి దర్శకుడు 'కిళక్కె పోగుమ్ రైల్' సినిమాలో సుధాకర్‌ను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమాలో సుధాకర్ జోడీ ఎవరో తెలుసా! రాధిక!! ఆ సినిమాని తర్వాత బాపు తెలుగులో 'తూర్పు వెళ్లే రైలు'గా రీమేక్ చేశారు. 1978 ఆగస్ట్ 10న విడుదలైన 'కిళక్కె పోగుమ్ రైల్' సూపర్ హిట్టయింది. దాంతో సుధాకర్, రాధిక జోడీ తమిళంలో ఓ పది సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించేశారు. హీరోగా అలాంటి చరిత్ర సుధాకర్‌ది.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో 1959 మే 18న పుట్టారు సుధాకర్. అప్పుడు వాళ్లనాన్న డిప్యుటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివిన సుధాకర్ నటన మీద పిచ్చితో మద్రాస్‌కు వెళ్లి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యారు. చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావు ఆయన బ్యాచ్‌మేట్స్, రూమ్‌మేట్స్.
తమిళంలో మంచి పేరు వచ్చినా తెలుగు సినిమాల్లో రాణించాలనేది సుధాకర్ కోరిక. అందుకే డి.ఎస్. ప్రకాశరావు డైరెక్ట్ చేసిన 'పవిత్ర ప్రేమ' (1979) సినిమాలో చిన్న పాత్ర చేశారు. ఊరికిచ్చిన మాట సినిమా పేరు తేవడంతో అవకాశాలు వరుసగా వచ్చాయి. ఆ తర్వాత కాలంలో 'మజ్ను' లాంటి సినిమాల్లో విలన్‌గా రాణించారు. చివరకు కమెడియన్‌గా స్థిరపడ్డారు. డిఫరెంట్ డైలాగ్ డిక్షన్, మేనరిజమ్స్‌తో తనదైన బాణీని ఆయన సృష్టించుకున్నారు. హీరో వెంకటేశ్ కాంబినేషన్ ఆయనకు బాగా కలిసొచ్చింది. అలా ప్రేక్షకుల అభిమాన హాస్యనటునిగా ఆయన గుర్తింపుపొందారు. 'పెద్దరికం', 'స్నేహితులు' చిత్రాలకు గాను ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డులు అందుకున్నారు. దాదాపు ఆయన 600 సినిమాల దాకా నటించారు.
యముడుకి మొగుడు, తాతయ్య పెళ్లి మనవడి శోభనం, కిష్కింధకాండ, పరుగో పరుగు చిత్రాలకు నిర్మాతగాను వ్యవహరించారు సుధాకర్. నటునిగా మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే మద్యపానానికి బానిసై ఉన్నట్లుండి నటనకు దూరమై, ఇంటికే పరిమితమయ్యారు సుధాకర్. కొంత కాలం క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. నేడు ఆయన పుట్టినరోజు.