విజయ్ సినిమా వెనక్కి.. కొత్తవారితో మ్యాజిక్ చేస్తున్న గౌతమ్!
on Jan 29, 2024
కొందరు దర్శకులు తాము రూపొందించే పెద్ద సినిమాలు ఆలస్యమవుతుంటే, ఆ గ్యాప్ లో చిన్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా అదే చేశాడు. 'జెర్సీ' వంటి క్లాసికల్ సినిమా తర్వాత, విజయ్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాని ప్రకటించాడు గౌతమ్. అయితే విజయ్ 'ఫ్యామిలీ స్టార్' మూవీతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో ఈ గ్యాప్ లో సితార బ్యానర్ లోనే కొత్త వారితో ఓ చిన్న సినిమాని పూర్తి చేశాడు దర్శకుడు గౌతమ్.
పలువురు కొత్తవారిని ప్రధాన పాత్రలలో పరిచయం చేస్తూ 'మ్యాజిక్' అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి . ఈ కథ, త్వరలో జరగబోయే తమ కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ ను కంపోజ్ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందట.
ఇది కొత్త వారితో రూపొందుతోన్న సినిమా అయినప్పటికీ దీని కోసం ఎందరో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తుండటం విశేషం. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నవీన్ నూలి, కాస్ట్యూమ్ డిజైనర్ గా నీరజ కోన వ్యవహరిస్తున్నారు
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ ఆకర్షణీయమైన టీనేజ్ మ్యూజికల్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు
కాగా, గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ 'మ్యాడ్' చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సితార సంస్థ.. మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.