'భీమా' పైనే ఆశలు.. ఇది కూడా పోతే గోపీచంద్ పరిస్థితి ఏంటి?
on Mar 4, 2024
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో గోపీచంద్ ఒకరు. మంచి కటౌట్, దానికి తగ్గట్లే మంచి పర్ఫామెన్స్ ఆయన సొంతం. కెరీర్ స్టార్టింగ్ లో పవర్ ఫుల్ విలన్ రోల్స్ పోషించి మెప్పించిన గోపీచంద్.. ఆ తర్వాత హీరోగా పలు కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. హీరోగా 2004 నుంచి 2008 వరకు 'యజ్ఞం', 'ఆంధ్రుడు', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం' ఇలా ఏడాదికి కనీసం ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నుంచి విజయాల కంటే పరాజయాలే ఆయనను ఎక్కువగా పలకరించాయి. 2014 లో 'లౌక్యం'తో అదిరిపోయే హిట్ అందుకొని, సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టు కనిపించినా.. ఆ తర్వాత మళ్ళీ అదే తడబాటు కొనసాగుతోంది. ఆయన సరైన హిట్ అందుకొని దాదాపు పదేళ్లు అవుతుంది. మధ్యలో 'గౌతమ్ నంద', 'సీటిమార్' వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాయి. దీంతో ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ 'భీమా' సినిమా పైనే ఉన్నాయి.
గతేడాది శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన 'రామబాణం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు గోపీచంద్. తనకు 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్లను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో దీనిపై కూడా గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గోపీచంద్-శ్రీవాస్ ల హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ పడింది. దాంతో హిట్ కోసం గోపీచంద్ మళ్ళీ వేట కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్చి 8న 'భీమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు గోపీచంద్. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ గా అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. గోపీచంద్ కటౌట్ కి తగ్గ సరైన యాక్షన్ ఫిల్మ్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం గోపీచంద్ ట్రాక్ రికార్డు దృష్ట్యా.. ఆయన స్థాయికి తగ్గ ఓపెనింగ్స్ రావడం అనుమానమే. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫుల్ రన్ లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఏది ఏమైనా ఈ సినిమా హిట్ కావడం అనేది గోపీచంద్ కి చాలా ముఖ్యం. పొరపాటున ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే గోపీచంద్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశముంది. మరి ఈ టాలెంటెడ్ హీరో 'భీమా'తో నైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదని నిరూపించుకుంటాడేమో చూడాలి.
Also Read