ఇది నిజంగా రాజమౌళి సినిమాయేనా..?
on Nov 13, 2025

ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే ఎక్కువమంది చెప్పే పేరు.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli). బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో రాజమౌళి.. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. (GlobeTrotter)
మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా.. 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో ప్రచారం పొందుతోంది. అధికారికంగా టైటిల్ రివీల్ చేయాల్సి ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానికి తోడు, అత్యంత భారీ బడ్జెట్ తో గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న సినిమా కావడంతో.. దీనికి సంబంధించిన ప్రతి అంశం భారీగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే.. ఫస్ట్ రివీల్ కోసం నవంబర్ 15న భారీస్థాయిలో 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే ఆ ఈవెంట్ జరగడానికి ముందే.. సాంగ్, ఫస్ట్ లుక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూ వస్తున్నారు రాజమౌళి. సంచారి సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ఫస్ట్ లుక్ ల గురించి తెగ చర్చ జరుగుతోంది.
'గ్లోబ్‌ట్రాటర్'లో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుంభగా పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. వీల్ చైర్ లో కూర్చొని రోబోటిక్ సపోర్ట్ తో ఉన్న కుంభ లుక్ ఆకట్టుకుంది. అయితే కొందరు మాత్రం ఈ లుక్ పై పెదవి విరిచారు. గతంలో ఈ తరహా లుక్స్ చూశామని అభిప్రాయపడ్డారు.

ఇక తాజాగా మందాకినిగా ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. గన్ ఫైరింగ్ చేస్తూ ఎల్లో శారీలో ప్రియాంక పవర్ ఫుల్ గా కనిపించింది. బుల్లెట్ల వర్షం కురుస్తున్నా, ఒక్క బుల్లెట్ నడుముని తాకుతూ వెళ్ళినా.. ఏమాత్రం జంకకుండా షూట్ చేస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ మెప్పించింది. అయితే దీనిపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు పోస్టర్లలోనూ కొత్తదనం లేదని అంటున్నారు. ఇంకా కొందరైతే.. రాజమౌళి గత చిత్రాల స్థాయిలో ఈ పోస్టర్లు లేవని, అసలు ఇది రాజమౌళి సినిమానేనా? అని డౌట్ వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. మెజారిటీ ఆడియన్స్ మాత్రం రాజమౌళి మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ పీరియాడిక్ ఫిలిమ్స్ అని.. వాటి పోస్టర్స్ తో 'గ్లోబ్‌ట్రాటర్'ను పోల్చడం సరికాదని అంటున్నారు.
ఇండియానా జోన్స్ తరహాలో ఇది అడ్వెంచర్ ఫిల్మ్ అని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. పైగా రాజమౌళిని అసలు తక్కువ అంచనా వేయకూడదు. ఎలాంటి కథతోనైనా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలరు. అలాంటి రాజమౌళి.. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని ఇంకెంత గొప్పగా మలుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

సరిగ్గా గమనిస్తే.. కుంభ, మందాకిని పోస్టర్లలోనూ రాజమౌళి మార్క్ కనిపిస్తుంది. కుంభ కూర్చున్న వీల్ చైర్.. రోబోటిక్ సపోర్ట్ తో ఉన్నటువంటి వరల్డ్ లోనే అడ్వాన్స్డ్ చైర్. ఇక మందాకిని పోస్టర్ లో పురాతన శిల్ప కళ కనిపిస్తోంది. ఈ రెండు పోస్టర్లు వైవిధ్యంగా ఉన్నాయి. అలాంటిది ఈ రెండు పాత్రలు సినిమాలో ఇంకెంత వైవిధ్యంగా కనిపిస్తాయో ఊహించుకోవచ్చు.
'గ్లోబ్‌ట్రాటర్'లో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారని సమాచారం. నవంబర్ 15న ఆ పాత్ర లుక్ ని రివీల్ చేయడంతో పాటు, సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లింప్స్ తో రాజమౌళి అన్ని లెక్కలు సరి చేస్తారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



