హౌస్ బయటకు వచ్చేసిన గంగవ్వ.. చంటిపిల్లాడిలా ఏడ్చిన అఖిల్!
on Oct 11, 2020
బిగ్ బాస్ సీజన్ 4లో గ్రామీణ ప్రాంతాల వీక్షకులను ఆకర్షించిన యూట్యూట్ స్టార్ గంగవ్వ అనారోగ్యం కారణంగా ఇంటిదారి పట్టారు. అవ్వకోసమే బిగ్ బాస్ షోను చూసేవారి సంఖ్య లక్షల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ సీజన్‌లో నామినేషన్ లేకుండా బిగ్ హౌస్ నుంచి ఇష్టపూర్తిగా బయటకు వచ్చిన మొదటి కంటెస్టెంట్ గా ఆమె నిలిచారు. గత కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్యం బాగాలేదు. ప్రకృతి మధ్య స్వేచ్ఛాయుతవాతావరణంలో ఉండే ఆమె నాలుగ్గుగోడల మధ్య ఇమడలేకపోయారు. పల్లెలో అటూ ఇటూ తిరుగుతూ అందరినీ పలుకరిస్తూ తిరిగే ఆమెకు బిగ్ హౌస్ వాతావరణం సరిపడలేదు. దాంతో "అన్నం సహిస్తలేదు, నిద్ర పడతలేదు" అంటూ ఇంటిసభ్యులతో వాపోయారు.
బిగ్ బాస్ లో వచ్చే పారితోషికంతో ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆమె కలను నిజం చేస్తామని, ఇల్లు కట్టిస్తానని నాగార్జున మాటిచ్చారు. హౌస్ లో అందరికన్నా వయసులో పెద్దవారైన గంగవ్వ చాలాబాగా ఆడారని నాగార్జున మెచ్చుకున్నారు. అయితే ఆమె ఆరోగ్యపరిస్థితి బాగాలేదని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ పరిశీలించారు. ఆమెను కన్ఫెషన్ రూంకు పిలిపించారు.
"పదిరోజులుగా నిద్ర పోతలేను. అన్నం సహిస్తలేదు. ఇల్లు లేదని వచ్చాను. ఇంకా రెండువారాలు ఉందాం అనుకున్నాను కానీ నా వల్ల ఐతలేదు. ఇక్కడ మంచిగ చూసుకుంటున్నరు. కానీ, ఉండలేకపోతున్నా.. ఆట కూడా ఆడలేకపోతున్నా. నన్ను ఊరు పంపించేయండి" అని బిగ్ బాస్ ను వేడుకున్నారు గంగవ్వ. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న నాగ్.. "అవ్వ ఈ బిగ్ హౌస్ నుంచి వెళ్లడానికి అనుమతి ఇవ్వండి బిగ్ బాస్" అని కోరారు. దీంతో ఆమె వెళ్లిపోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. మిగతా కంటెస్టెంట్లు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. హౌస్ లో మొదటినుంచి అవ్వను కేరింగ్ గా చూసుకుంటూ, అనుబంధం పెంచుకున్న అఖిల్ కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు.
కన్ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చిన గంగవ్వకు ఇంటిసభ్యులంతా కన్నీటితో వీడ్కోలు చెప్పారు. తనకు ఈ హౌస్ లో ఉన్నది గంగవ్వ మాత్రమే అని నిన్న మోనాల్ తో చెప్పిన అఖిల్ హార్ట్ షేప్ పిల్లోను బహుమతిగా ఇస్తూ చంటిపిల్లాడిగా ఏడ్చేశాడు. "మంచిగ ఆడండి.. బిగ్ బాస్ అయిపోయినంక మా ఇంటికి రండి అంటూ అందరికి కోడికూర చేసి పెడతా" అంటూ టాటా చెప్పారు గంగవ్వ.
ఇంటి నుంచి స్టేజ్ పైకి వచ్చిన గంగవ్వ నాగార్జునను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. "ఊరిలో అందరి మధ్య ఉన్నా.. ఇంట్లో నిద్ర పడతలేదు. ఇల్లు లేదని వచ్చాను. కానీ నా వల్ల ఐతలేదు. మీకు మనుమరాలు పుట్టినంక హైదరాబాద్ వచ్చి మీ ఇల్లు చూస్తా" అన్నారు గంగవ్వ.
- యశోద వంగా

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
