సెప్టెంబర్ కాదు.. కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'గేమ్ ఛేంజర్'!
on Feb 28, 2024
'గేమ్ ఛేంజర్' మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుందని కొద్దిరోజులుగా న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ లో కూడా రావడం లేదని.. మరో కొత్త విడుదల తేదీని లాక్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చరణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'ఇండియన్-2' ఇంకా పూర్తి కాకపోవడం, చాలా రోజులుగా 'గేమ్ ఛేంజర్'కి సంబంధించిన అప్డేట్స్ లేకపోవడంతో.. నిజంగా సెప్టెంబర్ లో విడుదలవుతుందా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి అనుమానమే నిజం కానుందని తెలుస్తోంది.
ఇప్పటిదాకా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ 70 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగం షూటింగ్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. అయితే భారీ సినిమా కావడంతో.. పలువురు ప్రముఖ నటీనటుల డేట్స్ సమస్య, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కావాల్సి ఉండటం వంటి కారణాలతో సెప్టెంబర్ లో విడుదల కావడం కష్టమేనట. అందుకే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారని వినికిడి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయడంతో పాటు.. రిలీజ్ డేట్ ని ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారట.
కియారా అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్, అంజలి తదితరులు నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Also Read