'సేఫ్' నుంచి 'ప్రాఫిట్' దిశగా.. 'గద్దలకొండ గణేష్'!
on Sep 27, 2019
'గద్దలకొండ గణేష్' టీమ్ తెలుగు రాష్ట్రాల్లో 'జైత్రయాత్ర' పేరుతో థియేటర్ల దగ్గరకు చక్కర్లు కొడుతుండగా, ఆ మూవీ వసూళ్లు రోజురోజుకూ నెమ్మదిస్తున్నాయి. తొలి వారాంతం.. అంటే విడుదలైన తొలి మూడు రోజుల్లో సుమారు 13 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఆ మూవీ తొలి వారం మొత్తం వసూళ్లు 17 కోట్ల రూపాయలకు చేరాయి. సోమవారం నుంచి గురువారం వరకు.. నాలుగు రోజుల్లో 'గద్దలకొండ గణేష్' రాబట్టిన షేర్ కేవలం 4 కోట్ల రూపాయలే! మరో రకంగా చెప్పాలంటే తొలి మూడు రోజుల వసూళ్లతో పోలిస్తే, తర్వాత నాలుగు రోజుల్లో వసూలైంది.. అందులో 31 శాతమే!
వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చెయ్యగా, హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్'కు కలెక్షన్లు వచ్చే అవకాశం అక్టోబర్ 1వ తేదీ వరకే ఉంది. అక్టోబర్ 2న చిరంజీవి సినిమా 'సైరా.. నరసింహారెడ్డి' రిలీజవుతోంది. ఏవో కొద్ది థియేటర్లు మినహా, మిగతా అన్ని థియేటర్లనూ ఆ మెగా మూవీ ఆక్రమించుకోనున్నది. దాంతో 2వ తేదీ నుంచి 'గద్దలకొండ గణేష్'కు వచ్చే షేర్ నామ మాత్రమేనని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
కాబట్టి ఈ సెకండ్ వీకెండ్ చాలా కీలకం కానున్నది. శుక్ర, శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్ల మీదనే బయ్యర్లు.. సేఫ్ జోన్ నుంచి ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెడతారా, లేదా.. అనేది ఆధారపడి ఉంది. ఇప్పటివరకూ వచ్చిన వసూళ్లను గమనిస్తే ఆంధ్రాలోని రెండు ఏరియాల్లో 'గద్దలకొండ గణేష్' ఇప్పటికే ప్రాఫిట్ జోన్లోకి వచ్చాడు. ఆ ఏరియాలు.. నెల్లూరు, పశ్చిమ గోదావరి. అలాగే కృష్ణా, తూర్పు గోదావరి ఏరియాల బయ్యర్లు సెకండ్ వీకెండ్‌లోపు ప్రాఫిట్లో అడుగుపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి.
తెలంగాణలో ఈ మూవీ బ్రేకీవెన్ సాధించాలంటే.. ఇంకా కోటి రూపాయలకు పైగా షేర్ రావాల్సి ఉంది. గత నాలుగు రోజుల్లో ఈ ఏరియాలో 1 కోటి 60 లక్షలకు పైగా షేర్ వచ్చినందున ఈ వీకెండ్లో కోటి రూపాయలు రావడం సునాయాసమేనని బయ్యర్లు ఆశిస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే తెలంగాణ బయ్యర్లు సేఫ్ జోన్ నుంచి ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమే. అయితే ఆశించిన రీతిలో లాభాలు రావడం కష్టమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇక రాయలసీమ ఏరియా విషయం చూస్తే, మరో 50 లక్షల రూపాయల షేర్ రాబడితే, ఈ ప్రాంతం బయ్యర్లు కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో 75 లక్షల రూపాయలు వచ్చాయి కాబట్టి, ఈ వీకెండ్‌తో లాభాల్లోకి వచ్చేస్తామని వారు ఆశిస్తున్నారు.
ఓవరాల్‌గా చూస్తే.. ఈ సినిమా బ్రేకీవెన్ కావడానికి ఇంకా 2 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ రావాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సో.. ఈ సెకండ్ వీకెండ్‌తో 'గద్దలకొండ గణేష్' దాన్ని సాధించి, ప్రాఫిట్ జోన్లోకి రావడం లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావడం తథ్యమని మొదట్లో విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పటి వసూళ్ల సరళి ప్రకారం 'హిట్'తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వాళ్లు అంటున్నారు. చూద్దాం.. చివరకు 'గద్దలకొండ గణేష్' లెక్కలు ఎక్కడ తేలుతాయో..!