బాలీవుడ్‌లో ఘోరంగా ఫెయిలైన తెలుగు దర్శకుడు!
on Sep 27, 2019
టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న తెలుగు దర్శకుడు దేవా కట్టా బాలీవుడ్ తొలి యత్నం ఘోరంగా దెబ్బతిన్నది. అతను డైరెక్ట్ చెయ్యగా సీనియర్ స్టార్ సంజయ్ దత్ సొంత సంస్థ నిర్మించిన 'ప్రస్థానం' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నమోదైంది. సెప్టెంబర్ 20న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ కేవలం రూ. 4.33 కోట్ల (నెట్) మాత్రమే సాధించి, డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లనూ భారీ స్థాయిలో నష్టపర్చింది.
తెలుగులో తను రూపొందించగా 2010లో విడుదలైన 'ప్రస్థానం' సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశాడు దేవా కట్టా. తెలుగులో సాయికుమార్ చేసిన కేరెక్టర్‌ను హిందీలో సంజయ్ దత్ పోషించాడు. శర్వానంద్ చేసిన పాత్రను అలీ ఫజల్, సందీప్ కిషన్ కేరెక్టర్‌ను సత్యజీత్ దూబే చేశారు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవా. తెలుగులో కెరీర్ ఆశించిన రీతిలో సాగకపోవడంతో, ముంబై వెళ్లి 'ప్రస్థానం' మూవీని సంజయ్ దత్‌కు చూపించాడు. అది నచ్చి, తనే సొంతంగా నిర్మించేందుకు ఆయన ముందుకు వచ్చాడు.
కొంత కాలంగా సంజయ్‌కు ప్రధాన పాత్రల్ని ఎవరూ ఆఫర్ చెయ్యడం లేదు. అందుకని ఆయన కూడా సినిమాపై చాలా ఆశలే పెట్టుకొన్నాడు. కానీ ప్రేక్షకులు ఈ సినిమాని అవమానకరంగా తిరస్కరించారు. 'చిచ్చోరే', 'డ్రీమ్ గాళ్' వంటి చిన్న సినిమాలు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చోట 'ప్రస్థానం' ఇంత దారుణంగా ఆడటం సంజయ్, దేవా కట్టాలకు మింగుడు పడని విషయం. కొద్ది కాలం క్రితమే మరో తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.. 'కబీర్ సింగ్' మూవీతో ఘనంగా బాలీవుడ్‌లో తన ప్రారంభాన్ని చాటుకుంటే, అందుకు పూర్తి భిన్నంగా భారీ డిజాస్టర్‌తో అత్యంత నిరాశా జనకంగా బాలీవుడ్‌లో తన 'ప్రస్థానం'ను మొదలుపెట్టాడు దేవా.