'ఆర్ఆర్ఆర్' ఫుల్ టైటిల్ అదే!
on Mar 3, 2020
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్'కు ఇంతదాకా పూర్తి టైటిల్‌ను అనౌన్స్ చెయ్యలేదు. ఈ కాంబినేషన్ మూవీని అనుకున్నప్పుడు సౌలభ్యం కోసం 'ఆర్ఆర్ఆర్' అంటూ దాన్ని పరిగణిస్తూ వచ్చారు. రాజమౌళి, రామారావు (తారకరామ్), రాంచరణ్ కలిసి పనిచేస్తున్న సినిమా కాబట్టి అలా పెట్టారు. అయితే ఇద్దరు హీరోలకు తగినట్లుగా టైటిల్ నిర్ణయించడం/కనిపెట్టడం రాజమౌళి బృందానికి కూడా కష్టమైంది. అల్రెడీ 'ఆర్ఆర్ఆర్' అనేది పాపులర్ అయ్యింది కాబట్టి ఆ మూడు పొడి అక్షరాలు కలిసివచ్చేలా టైటిల్ పెట్టాలనేది వాళ్ల ఆలోచన.
ఈ మూవీలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండటంతో వాళ్ల పాత్రలను కూడా టైటిల్ రిఫ్లెక్ట్ చేస్తున్నట్లు ఉండాలి. ఇదే పెద్ద టాస్క్‌గా మారింది. దాంతో 'ఆర్ఆర్ఆర్'కు అనుగుణంగా టైటిల్ పెట్టండంటూ ప్రేక్షకులకు పిలుపునిచ్చారు నిర్మాతలు. స్పందించిన అభిమానులు, ప్రేక్షకులు చాలా టైటిల్స్‌నే సూచించారు. వాటిలో 'రఘుపతి రాఘవ రాజారామ్' ఒకటి. పాన్ ఇండియా సినిమాకు ఆ టైటిల్ కరెక్టుగా ఉంటుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఆ టైటిల్లో తారక్ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ కావట్లేదని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతూ వస్తున్నారు.
ఆ టైటిల్ కాకుండా 'రణమున రగిలిన రుధిరం', 'రాజ్యం రణం రక్తం', 'రథం రణం రుధిరం', 'రామ రావణ రణరంగం', 'రామ రాజ్య రూపకం', 'రామ రాజ్య రక్షకులు', 'రామ రావణ రాజ్యం'.. ఇట్లా చాలా పేర్లే పరిశీలనకు వచ్చాయి. అయితే వాటన్నింటిలోకీ 'రఘుపతి రాఘవ రాజారామ్' టైటిల్‌కే పాన్ ఇండియా లుక్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్నే ఖాయం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆన్లైన్లో ఈ టైటిల్ దాదాపు ఖరారయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. రాజమౌళి బృందం మాత్రం ఇంకా నోరువిప్పలేదు. కానీ అతి త్వరలోనే టైటిల్‌ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. 2021 జనవరి 8న విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియ, సముద్రకని వంటి తారలు నటిస్తున్నారు.