'ఇఫి'లో సందడి చేయనున్న 'ఎఫ్2'
on Oct 6, 2019
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన హిలేరియస్ ఎంటర్టైనర్ ఒక అరుదైన గౌరవాన్ని పొందింది. వచ్చే నవంబర్‌లో గోవాలో జరిగే 'ఇఫి' (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలో 'ఇండియన్ పనోరమ' విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. తమన్నా, మెహ్రీన్ నాయికలుగా నటించిన ఈ మూవీ 'ఇఫి 2019'లో ప్రదర్శనకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం కావడం గమనార్హం. ఈ విషయన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తమ ట్విట్టర్ పేజీల ద్వారా తెలియజేస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్2' మూవీ ఈ ఏడాది గట్టి పోటీ మధ్య సంక్రాతి విజేతగా నిలిచి, ఏకంగా 80 కోట్ల రూపాయల షేర్ పైగా సాధించి, అటు వెంకటేశ్, ఇటు వరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీతో కెరీర్లో వరుసగా నాలుగో హిట్ సాధించి, టాప్ డైరెక్టర్స్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు అనిల్ రావిపూడి. అంతేనా.. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేశ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం ఆ ఇద్దరి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రూపొందుతోంది.
కాగా 'ఎఫ్2' సినిమాని హిందీలో అనిల్ డైరెక్షన్లోనే రీమేక్ చెయ్యడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు.. దానికి 'ఎఫ్3' పేరుతో తెలుగులో సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని ఈమధ్య ఆయన తెలిపారు కూడా. మొత్తానికి సంచలన విజయం సాధించి, ఎంతోమంది కెరీర్లో టాప్ ఫిలింగా నిలిచిన 'ఎఫ్2'.. ఇప్పుడు 'ఇఫి'లో సందడి చేయడానికి రెడీ అవుతోంది.