'డిస్కో రాజా' మూవీ ప్రివ్యూ
on Jan 18, 2020
మాస్ మహారాజాగా అభిమానులు పిలుచుకొనే రవితేజ జనవరి 24న 'డిస్కో రాజా'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో ఆకట్టుకున్న వి.ఐ. ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. ఏడాది పైగా గ్యాప్ తీసుకుని రవితేజ చేసిన ఈ సినిమాపై మొదట్లో పెద్ద బజ్ కనిపించలేదు. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సెకండ్ టీజర్‌తో ఒక్కసారిగా 'డిస్కో రాజా'పై అందరి చూపూ పడింది. ఒకప్పటి సంగీత సంచలనం బప్పీలహరితో పాటు రవితేజ సైతం గొంతు కలిపిన 'రమ్ పమ్ బమ్' సాంగ్ కూడా వైరల్ అవడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కొంత కాలంగా కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్ ఎదుర్కొంటూ వస్తున్న రవితేజకు ఈ సినిమా హిట్టవడం మినహా వేరే దారిలేదు.
రవితేజ చివరి హిట్ ఫిల్మ్ 'రాజా ద గ్రేట్'. దాని తర్వాత ఆయన చేసిన 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలను ఆడియెన్స్ తిరస్కరించారు. వీటిలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా అయితే మరీ ఘోరంగా ఫ్లాపయింది. "హాయ్‌రే హాయ్.. జాంపండురోయ్.. చూడగానే నోరూరెరోయ్.." అంటూ 'సిందూరం'లో హీరోయిన్ సంఘవిని అల్లరిపెడుతూ కనిపించిన రవితేజ చాలా వేగంగా స్టార్ రేంజికి చేరుకున్నాడు. పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇడియట్' మూవీ రవితేజ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తనకే ప్రత్యేకమైన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు రవితేజ. ఆ సినిమా నుంచి చాలా కాలం దాకా ఆయన వెను తిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు.
ఆ తర్వాత 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'వెంకీ', 'భద్ర', 'విక్రమార్కుడు', 'దుబాయ్ శీను', 'కృష్ణ', 'కిక్', 'డాన్ శీను', 'మిరపకాయ్', 'బలుపు', 'పవర్', 'రాజా ది గ్రేట్' వంటి హిట్లిచ్చాడు రవితేజ. 2011లో వచ్చిన 'మిరపకాయ్' మూవీ తర్వాత రవితేజ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో ఆయన మార్కెట్ విలువ పడిపోయింది. 'బలుపు', 'పవర్' సినిమాలతో మళ్లీ బరిలోకి వచ్చిన ఆయనను 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' సినిమాలు దెబ్బకొట్టాయి. 'రాజా ది గ్రేట్' హిట్టయిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2018లో హాట్రిక్ ఫ్లాపులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 'నేల టిక్కెట్టు' ఫ్లాపైతే, 'టచ్ చేసి చూడు', 'అమర్ అక్బర్ ఆంటోని' డిజాస్టర్లయ్యాయి.
ఆందోళన కలిగించిన విషయమేమంటే ఆ రెండూ 10 కోట్ల రూపాయల షేర్ కూడా సాధించలేకపోవడం. ఆయన కెరీర్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆ సినిమాలు హెచ్చరిక పంపాయి. ఇప్పుడు పెద్ద హిట్టు వస్తే తప్ప ఆయన మార్కెట్ వాల్యూ పెరగదు. కథల విషయంలో, పాత్రల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంతకాలంగా నిర్మించుకుంటూ వచ్చిన కెరీర్ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తూ వి.ఐ. ఆనంద్ చెప్పిన 'డిస్కో రాజా' స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వెంటనే షూటింగ్‌కు వెళ్లలేదు. స్క్రిప్ట్ విషయంలో కొన్ని సందేహాలు తలెత్తడంతో డైరెక్టర్‌ను మరింత గ్రిప్పింగ్‌గా స్క్రీన్‌ప్లే రాయాల్సిందిగా కోరాడు. తనకు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ నచ్చిన తర్వాతే సెట్స్ మీదకు వెళ్లాడు. అందువల్లే మునుపటి సినిమాకూ, 'డిస్కో రాజా'కూ మధ్య ఏడాది పైగా గ్యాప్ వచ్చింది.
రవితేజ సినిమా అంటే ఉండే జోష్‌తో పాటు యాక్షన్ ప్రియుల్ని అలరించే ఫైట్లూ ఈ సినిమాలో ఉంటాయని డైరెక్టర్ చెబుతున్నాడు. ప్రతిభావంతుడైన నటుడిగా పేరుపొందిన బాబీ సింహా ఈ మూవీలో విలన్‌గా కనిపించనున్నాడు. టీజర్ ప్రకారం అతడి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనేది స్పష్టం. రవితేజలోని అల్లరోడికి మరో ఇద్దరు అల్లరోళ్లు.. సునీల్, వెన్నెల కిశోర్ తోడయ్యారు. వాళ్లు ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తారని టాక్. ఇప్పుడు టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా ఎలా నడుస్తుందో చెప్పాల్సిన పనిలేదు కదా! 'ఢిల్లీవాలా', 'రమ్ పమ్ బమ్' సాంగ్స్‌తో 'డిస్కో రాజా' కూడా లైంలైట్‌లోకి వచ్చేశాడు. 'ఆర్ఎక్స్ 100', 'వెంకీమామ' సినిమాలతో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్, 'ఇస్మార్ట్ శంకర్'తో గ్లామర్ కురిపించిన నభా నటేశ్ మరోసారి ఈ సినిమాతో మెరుపులు మెరిపించడానికి సిద్ధమయ్యారు. ఎలాంటి బజ్ లేని స్థితి నుంచి ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవేపు తిప్పుకున్న 'డిస్కో రాజా'గా రవితేజ ఆకట్టుకుంటాడా? చూడాలి.