మహేష్ చుట్టూ దర్శకుల చక్కర్లు
on Feb 25, 2020
నిజమే... వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇదీ నిజమే... ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. అయితే... మధ్యలో మనకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని కొందరు దర్శకులు సూపర్ స్టార్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మహేష్ బాబుకు కథ చెప్పి ఆయన చేత 'అయామ్ ఇంప్రెస్డ్' అనే మాట చెప్పించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు.
రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి అగ్ర దర్శకులు అందరూ ఇప్పుడు ఇతర సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో సుకుమార్ సినిమా చేసే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మహేష్ మీద కోపంతో అల్లు అర్జున్ దగ్గరకు సుకుమార్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి మెన్ననే మహేష్ హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' తీశాడు. ఇప్పుడు అతడు 'ఎఫ్3' స్క్రిప్ట్ పనులు మీద ఉన్నాడు. దాంతో టాప్ లీగ్ లో చేరాలని ఆశపడుతున్న దర్శకులు మహేష్ దగ్గరకు వెళ్లి కథలు చెబుతున్నారు. పరశురామ్ కాకుండా మహేష్ దగ్గరకు వెళ్ళిన దర్శకుల్లో ప్రవీణ్ సత్తారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్' వంటి చిన్న సినిమాలు తీసిన అతడు... రాజశేఖర్ హీరోగా 'గరుడవేగా' తీసి, తాను పెద్ద సినిమాలు కూడా హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. అలాగే, 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ మధ్యనే మహేష్ బాబును కలిశాడట. గతంలో వీరిద్దరి మధ్య ఒక కథ విషయమై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ కథను మళ్లీ పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు సందీప్. వీరితో పాటు కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సత్య, శ్రీను వైట్ల పేర్లు కూడా మహేష్ దగ్గరకు వెళ్ళిన దర్శకుల జాబితాలో వినబడుతున్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల ఫామ్ లో లేరు. ఆయనతో మహేష్ సినిమా చేసే అవకాశాలు లేనట్లే. పరశురామ్ తర్వాత మిగతా దర్శకుల్లో ఎవరో ఒకరితో సినిమా చేస్తే చేయవచ్చు. పరశురామ్ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ నటించే కథ తో వంశీ పైడిపల్లి వెళితే అతడు సినిమా పట్టాలెక్కుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
