బికినీ వద్దు... శ్రీదేవి బయోపిక్ ముద్దు
on Feb 25, 2020
పాయల్ రాజ్ పుత్ పేరు చెబితే కుర్రకారుకు పిక్ ఎక్కించే ఫిగర్ గుర్తొస్తుంది. 'ఆర్.ఎక్స్.100', 'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో ఆమె అందాలు ఆరబోసింది. అందువల్ల, ఆమెను హాట్ ఫిగర్ గానే చాలా మంది ప్రేక్షకులు చూస్తున్నారు. చూడడమే కాదు... సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేయమని అడుగుతున్నారు. అటువంటి హాట్ ప్రేక్షకులందరికీ పాయల్ గట్టి ఝలక్ ఇచ్చారు. తనకు బికినీ వేసుకోవాలని అనిపించడం లేదని స్పష్టంగా చెప్పారు. "అందరూ నా బికినీ ఫోటోలు ఎందుకు పడుతున్నారో తెలియడం లేదు. బికినీలో నాకు కంఫర్టబుల్ అనిపిస్తే వేసుకుంటా. ఇప్పట్లో బికినీ వేసుకోవాలి అనిపించడం లేదు" అని పాయల్ తెలిపారు. తన జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో 'ఆర్ఎక్స్ 100' సినిమా చేయడం ఒకటి అని అన్నారు.
ఒకవేళ తాను కథానాయిక కాకపోయి ఉంటే న్యూస్ యాంకర్ అయ్యేదని పాయల్ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగితే... "అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ చేయాలనుంది" అని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మంచి పాత్రలు వస్తే చేస్తానని ఆమె పేర్కొన్నారు. తెలుగులో తనకు ఇష్టమైన కథానాయిక తమన్నా అని, తాను శాఖాహారిని అని పాయల్ తెలిపారు.