బర్త్ డే స్పెషల్: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ముచ్చటగా మూడు `ఇండస్ట్రీ హిట్స్`!
on Jul 24, 2021
తెలుగునాట `ఇండస్ట్రీ హిట్స్` అనే మాట వినగానే ఠక్కున గుర్తొచ్చే దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. గోపాల్ కి ముందు, తరువాత కూడా మూడు లేదా అంతకుమించి ఇండస్ట్రీ హిట్స్ అందించిన నిర్దేశకులు ఉన్నప్పటికీ.. కేవలం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో మూడు ఇండస్ట్రీ హిట్స్ ని అందించిన అరుదైన ఘనత మాత్రం ఈ భారీ చిత్రాల దర్శకుడిదే అని చెప్పాలి. `సమరసింహారెడ్డి` (1999), `నరసింహనాయుడు` (2001), `ఇంద్ర` (2002) చిత్రాలతో ఈ రేర్ ఫీట్ ని సాధించారు బి. గోపాల్. విశేషమేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందాయి. అలా.. ఫ్యాక్షన్ చిత్రాలతోనే ముచ్చటగా మూడు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక దర్శకుడిగా బి. గోపాల్ టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇందులో మూడో చిత్రమైన `ఇంద్ర`.. బి. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా 19 ఏళ్ళ క్రితం ఇదే జూలై 24న విడుదలైంది. అంతేకాదు.. ఒకే హీరో కాంబినేషన్ లో తెలుగు చిత్ర పరిశ్రమకి బ్యాక్ టు బ్యాక్ `ఇండస్ట్రీ హిట్స్`ని అందించిన దర్శకుడిగానూ అప్పట్లో ప్రత్యేక గుర్తింపు పొందారు బి. గోపాల్. బాలయ్యతో తీసిన `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` చిత్రాలతో ఈ ఘనత సాధించారాయన.
(జూలై 24 దర్శకుడు బి. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా..)