పెద్ది ఫస్ట్ లుక్.. ఎన్టీఆర్ తప్పు చేశాడా..?
on Mar 27, 2025
ఒక హీరో కోసం అనుకున్న కథని మరో హీరో చేయడం అనేది కామన్. 'పెద్ది' (Peddi) విషయంలో కూడా అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలై, సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో 'పెద్ది'ని మిస్ చేసుకొని ఎన్టీఆర్ తప్పు చేశాడా? అనే చర్చలు మొదలయ్యాయి. (Jr NTR)
'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేసిన ఎన్టీఆర్.. ఆ సమయంలో బుచ్చిబాబుతోనూ ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. ఎన్టీఆర్ కి కథ నచ్చడంతో.. బుచ్చిబాబు కొద్ది నెలల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు. అప్పట్లోనే ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ప్రచారం జరిగింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అనూహ్యంగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ వెనకడుగు వేశాడు. ఓ వైపు బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2', మరోవైపు ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' ఉండటంతో.. బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని వదులుకున్నాడు. దాంతో ఈ 'పెద్ది' కథ రామ్ చరణ్ చెంతకు చేరింది. అసలు ఈ కథని చరణ్ కి చెప్పమని, ఎన్టీఆరే బుచ్చిబాబుకి సూచించాడనే ప్రచారం కూడా ఉంది. (Ram Charan)
ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్'లో నటించి, గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. ఆ తర్వాత 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్'తో నిరాశపరిచాడు. తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి చూపించాలన్న కసితో ఉన్న చరణ్ దగ్గరకు.. 'పెద్ది స్టోరీని' పట్టుకెళ్ళాడు బుచ్చిబాబు. కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పాడు చరణ్. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న 'పెద్ది' కోసం చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. 'పెద్ది' టైటిల్ ను అఫీషియల్ అనౌన్స్ చేయడంతో పాటు, ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో చరణ్ లుక్ అదిరిపోయింది. రా లుక్ తో సరికొత్త రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర చరణ్ కి ఎంత పేరు తీసుకొచ్చిందో, పెద్ది పాత్ర అంత పేరు తీసుకురావడం ఖాయమనే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకొని తప్పు చేశాడా? అనే చర్చ కూడా జరుగుతోంది.
'వార్-2', 'డ్రాగన్' రెండూ యాక్షన్ సినిమాలే. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా పెద్దగా వైవిధ్యం చూపించడానికి ఏముండదు. అందుకే ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్.. 'పెద్ది' లాంటి రా క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
