మెగాస్టార్, అనిల్ రావిపూడి సినిమా అప్‌డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే!
on Mar 26, 2025
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముహూర్తాన్ని ఉగాది రోజున నిర్ణయించారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను బుధవారం దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ఆల్రెడీ చిరంజీవికి నేరేషన్ కూడా ఇచ్చానని తెలిపారు. అంతేకాదు ఈ కథలోని శివశంకర వరప్రసాద్ పాత్రను చిరంజీవికి పరిచయం చేశానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు అనిల్. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో.. ‘చిరు’నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం.. అంటూ ఎంతో హ్యాపీ మూడ్‌లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30 ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి జరిగే అవకాశం ఉంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అందుకే నాన్‌స్టాప్‌గా వరస షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఎంతో స్పీడ్‌గా సినిమా పూర్తి చేస్తారనే పేరు ఉంది. టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయడమే కష్టంగా మారింది. కానీ, అనిల్ రావిపూడి స్కూల్ వేరు. ప్రీ ప్రొడక్షన్ గానీ, షూటింగ్‌గానీ ఎంతో వేగంగా పూర్తి చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కేవలం 72 రోజుల్లో పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు అనిల్ రావిపూడి.
ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉన్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి పెర్‌ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్‌లు, డాన్సులు ఎంత అద్భుతంగా చేయగలరో, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉన్న సన్నివేశాలను కూడా అంతే అద్భుతంగా చేస్తారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది. ఇది ప్రేక్షకులకు ఒక ఫుల్ మీల్స్ లాంటిది. ఎందుకంటే ఈ కథలో కుటుంబ నేపథ్యం, యాక్షన్ సీక్వెన్స్‌లు, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఒక పాత్ర కోసం అదితిరావు హైదరి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ఒక విభిన్నమైన కథను చిరంజీవి కోసం అనిల్ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కథ ఏదైనా అందులో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తారు. ఆ విధంగానే వరస విజయాలు అందుకుంటున్న అనిల్.. ఈ సినిమాలో మంచి మెసేజ్‌తోపాటు ప్రేక్షకులు, మెగాస్టార్ అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
