దేవిశ్రీ... బ్యాక్ టు మెగా కాంపౌండ్!
on May 12, 2020

దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. మాస్ ప్రేక్షకుల స్టెప్పులు వేయించే హుషారైన పాటలు ఇవ్వడంతో పాటు క్లాస్ ప్రేక్షకులు హమ్ చేసుకునేలా మెలోడీలనూ ఇస్తాడు. హీరోలు అందరికీ మంచి మంచి పాటలు ఇస్తాడు. అందులోనూ మెగా హీరోలు అంటే మరింత మనసుపెట్టి పాటలు చేస్తాడని పేరుంది.
మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ తో దేవిశ్రీప్రసాద్ పనిచేశాడు. అందరికీ సూపర్ హిట్ పాటలు ఇచ్చాడు. 'ఖైదీ నెంబర్ 150'లో 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు', 'రత్తాలు రత్తాలు' పాటలు ఇప్పటికీ వినపడుతున్నాయి. శంకర్ దాదా సాంగ్స్ అయితే చెప్పనవసరం లేదు. అభిమానులు ఇప్పటికే హమ్ చేస్తారు. పవన్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్', 'జల్సా' చిత్రాలకు దేవి హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో సినిమా అంటే మ్యూజికల్ హిట్ కింద లెక్క. ఐటమ్ సాంగ్స్ అదిరిపోతాయి. 'ఎవడు'తో రామ్ చరణ్ కి మంచి హిట్ ఇచ్చాడు. 'రంగస్థలం' పాటలు ఎవరు మర్చిపోతారు చెప్పండి?
అటువంటి దేవిశ్రీప్రసాద్ మీద సంక్రాంతికి మెగా అభిమానులు కొందరు సెటైర్స్ వేశారు. ట్రోల్స్ చేశారు. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' పోటీ నడుమ దేవిశ్రీ నలిగిపోయాడు. పాటల విషయంలో కాస్త వెనుకబడ్డాడని గుసగుసలు వినిపించాయి. అయితే... మెగా మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన'లో 'నీ కన్ను నీలి సముద్రం' పాటతో సమాధానం చెప్పాడు దేవి. ఆల్రెడీ ఆ పాట 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అంతేకాదు... ఇప్పుడు మెగా హీరోలతో దేవిశ్రీప్రసాద్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ ఫిలిం 'పుష్ప'కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ కొన్ని ట్యూన్స్ రెడీ చేశాడు. ఐటమ్ సాంగ్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అని అన్నాడు. అలాగే, 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమాకి సైతం దేవిశ్రీ సంగీతం అందించనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'కు సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ని పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



