వెనక్కి తగ్గుతున్న ఎన్టీఆర్.. ఆ హీరో ఫ్యాన్స్ రెచ్చిపోతారేమో!
on Jan 21, 2024

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో జరిగే అవకాశముందని, అదే జరిగితే ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన 'దేవర'(Devara) వాయిదా పడనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఏపీ ఎన్నికలతో సంబంధం లేకుండానే మరో కారణంతో 'దేవర' వాయిదా పడటం ఖాయమని తాజాగా ప్రచారం మొదలైంది. వీఎఫ్ఎక్స్ కి మరింత సమయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మేకర్స్ సినిమాని పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాల విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే ఏమాత్రం తేడా కొట్టినా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'ఆదిపురుష్' వంటి సినిమాల విషయంలో అదే జరిగింది. 'దేవర'లో కూడా భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. అందుకే మూవీ టీం ముందునుంచి పక్కా ప్లానింగ్ తో వెళ్తుంది. వీఎఫ్ఎక్స్ అవసరమైన సన్నివేశాలను ముందుగా చిత్రీకరించారు. దానివల్ల వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం దొరుకుతుంది. అయితే 'దేవర' టీం ఎంత ప్లానింగ్ తో వెళ్లినప్పటికీ, సమయం సరిపోవడం లేదని.. అందుకే కంగారుగా సినిమాని రిలీజ్ చేసేకంటే, కాస్త ఆలస్యమైనా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో రావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'దేవర' అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం అలాంటిదేం లేదని, సినిమా ఏప్రిల్ 5న రానుందని తెలపడం కొసమెరుపు.
'దేవర' టీం చెప్పినప్పటికీ.. వాయిదా ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ వర్గాల్లో పోస్ట్ పోన్ కానుందనే సమాచారం ఉందట. దానికి కారణం వీఎఫ్ఎక్స్ అని చెబుతున్నారు. ఒకవేళ వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తయినా.. ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటే మాత్రం 'దేవర'ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైందంటే జనాలు పెద్దగా సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. పైగా 'దేవర' లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కూడా ముఖ్యమే. మొండిగా ఎన్నికల సమయంలో సినిమాని విడుదల చేస్తే వసూళ్లపై తీవ్ర ప్రభావం పడి, భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి మేకర్స్ సినిమాని వాయిదా వేసే అవకాశముంది.
మరి వీఎఫ్ఎక్స్ కారణంగానో లేక ఏపీ ఎన్నికల కారణంగానో 'దేవర' వాయిదా పడుతుందో లేదో తెలీదు కానీ.. ఒకవేళ వాయిదా పడితే మాత్రం ఆ తేదీపై అప్పుడే వేరే సినిమాలు కర్చీఫ్ వేస్తున్నాయట. 'ఫ్యామిలీ స్టార్' మూవీని మార్చిలో విడుదల చేయాలి అనుకుంటుండగా.. ఏదైనా కారణం చేత 'దేవర' వాయిదా పడితే మాత్రం ఏప్రిల్ 5 కి తీసుకురావాలని చూస్తున్నారట. అదే జరిగితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే హాలిడేస్, లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా పర్ఫెక్ట్ డేట్ ని 'దేవర'టీం లాక్ చేసుకుంది. అలాంటి డేట్ కి వస్తే వసూళ్లు పెరిగే అవకాశముంటుంది. మరోవైపు 'దేవర' పోస్ట్ పోన్ అయితే ఆ సమయానికి రావాలని 'టిల్లు స్క్వేర్' టీం సైతం భావిస్తోందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



