ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ ఇక లేరు
on Dec 3, 2011
బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోగా ఇప్పటికీ పిలువబడే దేవ్ సాబ్ నిన్నరాత్రి లండన్ లో గుండెనొప్పితో మరణించారు.మరణించేనాటికి ఆయన వయసు 88 సంవత్సరాలు. ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ లో నారోవాల్ జిల్లాలో, గురుదాస్పూర్ అనే గ్రామంలో, 1923లో సెప్టెంబర్ 26 వ తేదీన ఆయన జన్మించారు. లాహోర్ లో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ తీసుకుని, 1940 లో ఆయన బొంబాయికి వచ్చారు.
1946 లో "హమ్ ఏక్ హై" చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్ లోకి హీరోగా ప్రవేశించారు. ఆ తర్వాత ప్రముఖ గాయని, హీరోయిన్ అయిన సురయాతో ప్రేమలో పడ్డారు. ఆ రోజుల్లోనే 3 వేలు ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని ఆమెకు తన ప్రేమ కానుకగా బహూకరించారు. కానీ ఆమె ముస్లిమ్, దేవానంద్ హిందూ కావటంతో వారి వివాహానికి ఆమె తరపు పెద్దలు అంగీకరించలేదు. దానిఫలితంగా సురయా చనిపోయే వరకూ అవివాహితగానే ఉండిపోయారు.
దేవానంద్ నటించిన తొలి రంగుల చిత్రం "గైడ్" ఆయనకు స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. 119 చిత్రాల్లో హీరోగా నటించిన దేవానంద్ 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించగా 1971లో వచ్చిన "హరేరామ హరేకృష్ణ" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని "దమ్ మారో దమ్ మిట్ జాయే గమ్...బోలో సుభో శ్యామ్ హరే కృష్ణ హరే రామ్" అనే పాట ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.
ఆయనకు అయిదు అంతర్జాతీయ అవార్డులు, 25 జాతీయ అవార్డులు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులూ లభించాయి. ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు మరపురానివి. అటువంటి దేవానంద్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగువన్ కోరుకుంటోంది.