తిరుపతిలో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ఫేమస్ ఫిల్మ్ స్టార్స్!
on Nov 13, 2019
ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మన జీవిత విధానాన్ని ప్రభావితం చేసే అంశం కూడా. ప్రేమలో పడినవాళ్లకే, దాని రుచి ఏమిటో తెలుస్తుంది. చాలామంది ప్రేమలో పడతారు. కానీ వారిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే వాళ్లు కొద్దిమందే. ఎన్నో ప్రేమకథలు కంచికి చేరకుండానే ఆగిపోతుంటాయి. ఎవరైనా ఇద్దరు సినీ సెలబ్రిటీలు లవ్‌లో ఉన్నారంటే, దానికి లభించే ప్రచారం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోనే లవ్ స్టోరీ అయితే నేషనల్ లెవల్లో ఎంత క్రేజ్ పొందిందో మనకు తెలుసు. కారణం.. దీపిక నంబర్ వన్ స్టార్ హీరోయిన్ అయితే, రణ్‌వీర్ టాప్ మేల్ స్టార్స్‌లో ఒకడు. ఆడా, మగా మధ్య ఎలా ఆకర్షణ పుట్టి, ప్రేమగా మారుతుందనేందుకు ఆ జంట పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
వాళ్ల మధ్య బంధానికి ఎప్పుడు బీజం పడిందో తెలుసా? 2012లో మకావూలో జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్‌లో తొలిసారి దీపికను దగ్గర్నుంచి చూసిన రణ్‌వీర్ కళ్లల్లో మెరుపులు మెరిశాయి, గుండెల్లో సీతాకోకచిలకలు ఎగిరాయి. ఈ విషయాన్ని ఆ తర్వాత రణ్‌వీరే బయటపెట్టాడు. దీపికతో పెళ్లయ్యాక జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడిన అతడు తాను ఈ శతాబ్దపు భర్తను కావాలనుకున్నానని తెలిపాడు. నిజమే. దీపికను పెళ్లాడిన అతడు తన కల నెరవేరిందనే అభిప్రాయంతోటే ఉన్నాడు.
ఇటలీలోని కోమో సరస్సు దగ్గర నవంబర్ 14, 15 తేదీల్లో జరిగిన వేడుకల్లో దీపిక, రణ్‌వీర్ దంపతులుగా మారారు. ఇప్పుడు తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి సిద్ధమయ్యారు. ఆ సంబరాన్ని వాళ్లు ఎక్కడ జరుపుకోనున్నారో తెలుసా? మన తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో! నవంబర్ 14న అంటే గురువారం తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తారు. వారి దీవెనలు అందుకొని, నవంబర్ 15న అమృత్‌సర్‌కు వెళ్లి స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ వేడుకలో రెండు కుటుంబాల సభ్యులూ పాల్గొననున్నారు. అదే రోజు రాత్రికి వాళ్లు ముంబైకి తిరిగివెళ్తారు. ఈ సందర్భానికి సంబంధించిన తమ ఫొటోలను వాళ్లు షేర్ చేసుకుంటారని ఆశించవచ్చు.
ఏడాది కాలంగా ఎంతో ఆనందంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న దీపిక ఇటీవల ఒక మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో వెల్లడించింది. ఆరేళ్ల క్రితం వాళ్లు డేటింగ్ మొదలుపెట్టారు. "అప్పుడు నేను అతనికంటే సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని, బిజీ పర్సన్‌ని. అతని కంటే ఎక్కువ సంపాదించే దాన్ని. నా సక్సెస్‌ని చూసి అతను పొంగిపోయేవాడు. నాతో చాలా సౌకర్యంగా ఉండేవాడు. నాపై చాలా శ్రద్ధ చూపేవాడు. అలాంటి వాడ్ని అప్పటి దాకా నేను చూడలేదు. నాకు సపోర్టివ్‌గా ఉంటూ, నేను కెరీర్‌లో మరింత ఎదగడానికి అతను ప్రోత్సాహమిస్తూ వచ్చాడు. ఏదో పైపైన మాటలు చెప్పడం కాదు, చేతల్లోనే దాన్ని చూపేవాడు. పెళ్లి తర్వాత తనను సంతోషపెట్టడానికి కెరీర్‌లో నేను రాజీ పడాల్సిన అవసరం లేదని అతను చెప్పేవాడు. అతనిలోని గొప్ప గుణానికి అది నిదర్శనం" అని చెప్పుకొచ్చింది దీపిక.
అలా రణ్‌వీర్‌తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీపిక. పెళ్లి తర్వాత ఆమె ఊహించిన దానికి మించి తన ప్రేమతో ఆమెను ఆనందపరుస్తూ వస్తున్నాడు రణ్‌వీర్. సినీ తారల్లో ప్రేమించి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత పొరపొచ్చాలతో విడిపోవడం మనం చూస్తూనే ఉంటాం. మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్, హృతిక్ రోషన్ - సుజానే ఖాన్, సైఫ్ అలీఖాన్ - అమృతా సింగ్, కమల్ హాసన్ - సారిక, సుమంత్ - కీర్తిరెడ్డి వంటి సినీ సెలబ్రిటీలు అందుకు ఉదాహరణలు. రణ్‌వీర్‌పై దీపిక నమ్మకాన్ని చూస్తుంటే, వాళ్లది దృఢమైన అనుబంధంగా కనిపిస్తుంది. ఏ అనుబంధమైనా బలపడాలంటే, వాళ్ల మధ్య స్నేహం బలంగా ఉండాలి. తమ ప్రేమబంధానికి ఆ స్నేహమే పునాది అని చెబుతుంది దీపిక. "మేము డేటింగ్ మొదలుపెట్టాక మా మధ్య స్నేహం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడూ అదే కంటిన్యూ అవుతోంది" అని ఆమె స్పష్టం చేసింది. తమ తొలి వివాహ వార్షికోత్సవానికి వేదికగా దీపిక, రణ్‌వీర్ జంట తిరుపతి వంటి పుణ్యక్షేత్రాన్ని ఎంచుకోవడం ముదావహం. 'పెళ్లంటే నూరేళ్ల పంట' కదా.. అదే తరహాలో వాళ్ల దాంపత్య జీవనం కలకాలం సంబరంగా సాగుతుందని ఆశిద్దాం.