టాప్ స్టోరీ: కాపీ కాంట్రవర్సీలో కూరుకుపోయిన 'సాహో'
on Sep 3, 2019
'ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్' అంటూ నానా హంగామా సృష్టించిన 'సాహో'పై కాపీ నీడలు కమ్ముకుంటున్నాయి. 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొంది విడుదలైన 'సాహో'కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, లైఫ్ టైం రన్‌లో ఆ సినిమా.. బయ్యర్లకు భారీ నష్టాలు తేవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'బాహుబలి'తో ప్రభాస్‌కు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకున్న ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మారు. వినాయకచవితి కారణంగా విడుదలైన నాలుగో రోజు కూడా మంచి కలెక్షన్లనే సాధించిన 'సాహో' మంగళవారం వసూళ్లు బాగా మందగించాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ రేట్ బాగా పడిపోయింది. ఆన్‌లైన్ బుకింగ్ డల్‌గా ఉంటోంది.
ఈ విషయం అలా ఉంచితే.. 'సాహో' సినిమా ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ 'లార్గో వించ్'కి కాపీ అంటూ ఆన్‌లైన్‌లో బాగా ప్రచారం జరగడం వివాదాన్ని సృష్టిస్తోంది. పైగా 'లార్గో వించ్' డైరెక్టర్ జెరోం సల్లే ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ 'సాహో' దర్శక నిర్మాతలనీ, హీరో ప్రభాస్‌నీ ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. సునీల్ అనే వ్యక్తి "బడ్డీ. మరో రోజు, ఇండియాలో మీ 'లార్గో వించ్'కు 'సాహో' అనే మరో ఫ్రీమేక్. మీరు అసలైన గురూజీ" అంటూ జేరోంకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దానికి "ఐ థింక్ ఆ హ్యావ్ ఎ ప్రామిసింగ్ కెరీర్ ఇన్ ఇండియా" అని వెటకారంగా రిప్లై ఇచ్చాడు జెరోం.
ఆ తర్వాత ఆయన మరో ట్వీట్ చేశాడు. "చూస్తుంటే, 'లార్గో వించ్'కు ఈ రెండో ఫ్రీమేక్ మొదటి దానంత బ్యాడ్ గానే ఉన్నట్లుంది. కాబట్టి తెలుగు డైరెక్టర్లూ, నా వర్క్‌ని మీరు దొంగిలించాలనుకుంటే, దయచేసి కనీసం ఆ పనైనా సరిగా చేయండి" అని సలహా ఇచ్చాడు. ఇందులో 'రీమేక్' అనే మాటని ఆయన ఒత్తి పలికాడు. 'మొదటిది' అని ఆయన ప్రస్తావించింది పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసిన 'అజ్ఞాతవాసి' సినిమా అనే విషయం తెలిసిందే. ఇలా తన ట్వీట్‌తో తెలుగు దర్శకులనందర్నీ ఆయన ఒకే గాటన కట్టేశాడు. అంతే కాదు, అదివరకు తాను చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ "నా 'ఇండియన్ కెరీర్' ట్వీట్ బాధాకరం. అయాం సారీ. బట్, ఆ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు" అని పేర్కొన్నాడు.
ఇలా.. తెలుగు డైరెక్టర్స్ అందర్నీ ఆయన జనరలైజ్ చేస్తూ విమర్శించినా మన డైరెక్టర్స్ ఎవరూ నోరు మెదపకపోవడం విడ్డూరం. ఇదే విషయమై తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. శంకర్‌ను ఫోన్‌లో సంప్రదించగా, తను జెరోం ట్వీట్‌ను ఇంతవరకూ చూడలేదని చెప్పారు. దాంతో ఫోన్‌లోనే జెరోం చేసిన ట్వీట్‌లను చదివి వినిపించగా, జెరోం ఒక డైరెక్టర్ అయ్యుండి, ఎవరో ఒకరిద్దరు చేసిన పనికి, డైరెక్టర్స్ అందర్నీ జనరలైజ్ చేసి విమర్శించడం సరైన పని కాదని శంకర్ అన్నారు. పైగా ఆ ట్వీట్‌ను బట్టి 'సాహో' సినిమాని ఆయన చూడలేదని అర్థమవుతోందనీ, సినిమా చూడకుండానే అది 'లార్గో వించ్'కు కాపీ అని ఆయన ఎలా నిర్ధారణకు వస్తాడని శంకర్ ప్రశ్నించారు. రేపు తమ అసోసియేషన్ మెంబర్స్‌తో మాట్లాడి జెరోం వ్యాఖ్యలపై ఏం చెయ్యాలనే విషయం చెబుతామని శంకర్ చెప్పారు.
'సాహో'పై కంటెంట్ కాపీ విమర్శలే కాకుండా ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్‌ను కూడా కాపీ చేసి ఒక పాటలో ఉపయోగించారనే విమర్శలూ రావడం గమనార్హం. తెలుగులో 'టక్కరిదొంగ' సినిమాలో హీరోయిన్‌గా నటించిన లీసా రే ఈ విషయాన్ని బయటపెడుతూ తన ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా 'సాహో' మేకర్స్‌ని ఘాటుగా విమర్శించింది. బెంగళూరుకు చెందిన షిలోశివ్ సులేమాన్ అనే లేడీ ఆర్టిస్ట్ గీసిన ఒక పెయింటింగ్ ఆధారం చేసుకొని, దాని మాదిరిగానే ఒక సెట్ వేసి, అందులో ప్రభాస్, శ్రద్ధాకపూర్‌పై ఒక సాంగ్ తీసినట్లు ఆ పెయింటింగ్‌ను బట్టి అర్థమవుతోంది. షిలోశివ్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, ఈ పని చేయడమంటే, దీన్ని ఇన్‌స్పిరేషన్ అనరనీ, దొంగతనం అంటారనీ లీసా రే విమర్శించింది.
ఇలా ఒకవైపు బ్యాడ్ టాక్‌తో మందగిస్తోన్న వసూళ్లు, మరో వైపు కాపీ విమర్శలతో 'సాహో' వివాదాల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది.