కాంట్రవర్సీలో కల్యాణి సినిమా.. అసలు డైరెక్టర్‌కు సపోర్ట్ చెయ్యని పూరి జగన్నాథ్!
on Mar 11, 2020
సీనియర్ నటి కల్యాణి దర్శక నిర్మాతగా మారి కే2కే ప్రొడక్షన్స్ బేనర్‌పై ఓ ద్విభాషా చిత్రాన్ని రూపొందించనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చేతన్ శీను, సిద్ది, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులనీ, వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తయారవుతోందనీ ఆమె ప్రకటించారు. ఇదే అసలు విషయాన్ని బయటపడేలా చేసిందని తెలుస్తోంది.
తెలుగువన్ దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి. చేతన్ శీను ఆఫీసులోనే కర్ణాటకకు చెందిన మయూర ప్రశాంత్ అనే ఔత్సాహిక దర్శకుడితో ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరిగాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాకనే నిర్మాతగా కల్యాణి ఈ ప్రాజెక్టులోకి ఎంటరయ్యారు. నాలుగైదు నెలల క్రితం ప్రశాంత్ డైరెక్షన్లోనే సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ.. ప్రశాంత్‌ను పక్కకు తప్పించేసిన కల్యాణి తానే దర్శక నిర్మాతగా ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. హోలీ రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో సినిమా ప్రి లుక్, టీజర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసినట్లు కూడా తెలిపిన ఆమె చేతన్ శీను స్టిల్‌ను మీడియాకు రిలీజ్ చేశారు.
దాంతో తనకు న్యాయం చేయాల్సిందిగా మయూర ప్రశాంత్ ట్విట్టర్ ద్వారా పూరి జగన్నాథ్, గౌతమ్ మీనన్ వంటి దర్శకులను కోరుతున్నారు. 7వ తేదీ పూరి జగన్నాథ్ ట్విట్టర్ ఎకౌంట్‌కు ట్యాగ్ చేసిన ఒక పోస్ట్‌లో, "మీరు సోమవారం రిలీజ్ చేయబోతున్న ప్రి లుక్, టీజర్ గ్లింప్స్‌కు చెందిన సినిమా స్టోరీ, స్క్రీన్‌పే నాది సార్. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేశాను. కానీ కే2కే ప్రొడక్షన్స్ వేరే డైరెక్టర్ పేరుతో ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కాబట్టి ఆ సినిమాకు మీరు సపోర్ట్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని కథపై నేను రెండేళ్ల కాలం వెచ్చించాను. మా మధ్య వివాదం ఓ కొలిక్కి రానివ్వండి" అని వేడుకున్నాడు. దీనికి పూరి జగన్నాథ్ రెస్పాండ్ కాలేదు. అతని అభ్యర్థనను పట్టించుకోలేదు.
రెండు రోజుల తర్వాత ఆయన ఆ సినిమా ప్రి లుక్, టీజర్ గ్లింప్స్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేయడం గమనార్హం. దీన్ని బట్టి తోటి దర్శకుడి విన్నపం కంటే కల్యాణికే పూరి ఎక్కువ విలువ ఇచ్చాడనేది స్పష్టం. దీంతో ఈ వ్యవహారంపై న్యాయం కోసం పోరాడాలని మయూర ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు.