మహేష్... బన్నీ సినిమాల మధ్య గొడవ ఆగదా?
on Jan 28, 2020
'అల... వైకుంఠపురములో' చిత్ర బృందం సోమవారం సాయంత్రం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. మా సినిమా రికార్డులు సృష్టిస్తోందని చెప్పుకొంది. "చాలా ఏరియాల్లో 'బాహుబలి 2' తర్వాత వచ్చి మా సినిమా ఆగింది. అమెరికాలో త్వరలో టాప్ త్రీలో చేరుతుంది. సినిమా ఎంత బాగా వచ్చిందని హీరో దర్శకుడు చూసుకుంటారు. ఆ తర్వాత సినిమా ఎంత బాగా వసూలు చేస్తుంది అనేది నిర్మాత చూసుకుంటాడు. వసూళ్లతో మేం హ్యాపీ" అని చిత్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ అన్నారు. శుక్రవారం డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నానని అల్లు అర్జున్ అన్నాడు. వీళ్లు ఇలా ప్రకటించారో... లేదో... 'సరిలేరు నీకెవ్వరు' సినిమా యూనిట్ ఒక పోస్టర్ విడుదల చేసింది. 'ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్' అని! దాంతో మళ్లీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. మా హీరో సినిమా హిట్ అంటే... మా హీరో సినిమా హిట్ అంటూ రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఒకరకంగా అభిమానుల మధ్య యుద్ధానికి కారణం హీరోలు, దర్శకులు, నిర్మాతలే.
'సరిలేరు నీకెవ్వరు', 'అల... వైకుంఠపుములో' సినిమాల మధ్య ఈ కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. విడుదల తేదీల దగ్గరనుండి విడుదలైన తర్వాత వరకు కొనసాగుతోంది. పోటాపోటీగా రికార్డులు ప్రకటించడం, ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్ లు పెట్టడం... ఒకటేమిటి అన్నీ చేస్తున్నారు. అభిమానులు కాకుండా మిగతా ప్రేక్షకులకు ఈ గొడవ నచ్చడం లేదు. మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అంటూ పట్టించుకోవడం లో రెండు సినిమా యూనిట్లు చూపిస్తున్న అత్యుత్సాహం అసలుకే ఎసరు తెస్తోంది. ఇద్దరూ ప్రకటించేది ఫేక్ రికార్డులు అని కొందరి వాదన. ఒక్కటి నిజం... రెండు సినిమాలకు సంక్రాంతి సీజన్ వల్ల మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఓ సినిమాకు కొంచెం ఎక్కువ మరో సినిమాకు కొంచెం తక్కువ వస్తుండవచ్చు. ఐకమత్యంగా ఉండాల్సింది పోయి ఇటువంటి పోటీల వల్ల సగటు ప్రేక్షకుల్లో చులకన అవుతున్నారు.