మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ! 'గాడ్‌ఫాదర్' షూటింగ్‌కు విరామం!!
on Oct 18, 2021
కుడిచేతి మణికట్టు దగ్గర ఉన్న నరం (మీడియన్ నర్వ్) ఒత్తిడికి గురవుతుండటంతో సమస్యలు ఎదుర్కొన్న మెగాస్టార్ చిరంజీవి దానికి సర్జరీ చేయించుకున్నారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి వారిని ప్రత్యేకంగా అభినందించారు చిరంజీవి. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది. ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు.
కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించాను. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ (median nerve) అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని, దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (carpal tunnel syndrome) అంటారని డాక్టర్లు చెప్పారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగింది. 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారు. అని చిరంజీవి చెప్పారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని, దర్శకుడు విజయబాపినీడు అల్లుడయిన సుధాకర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా పరిచయం ఉండడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చిరంజీవి వెల్లడించారు.
ఈ సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న గాడ్‌ఫాదర్ సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చినట్లు చిరు చెప్పారు. చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాని, నవంబర్ ఒకటో తారీకు నుంచి 'గాడ్‌ఫాదర్' సినిమా షూటింగ్ లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. మీరు ఇంతలా కష్టపడుతూ, మీ బాడీని కష్టపెడుతున్నారు కాబట్టి ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి అని ఇక మీదట కుడి చేతికి ఎలాంటి ఇబ్బంది లేదని సుధాకర్ రెడ్డి వెల్లడించినట్టు మెగాస్టార్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని మెగాస్టార్ అభిమానులతో పేర్కొన్నారు. మెగాస్టార్ చేతికి సర్జరీ అనే మాట వినగానే అభిమానులు తొలుత కంగారు పడినా, ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read