సాహో: యాక్షన్ సీన్స్ అదిరిపోతే చాలా?
on Aug 30, 2019
'సాహో' మూవీలోని యాక్షన్స్ సీన్స్ చూస్తే.. రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసే ఆ రేంజి యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీలోనూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు. అది నిజమే. దాదాపు అరగంట సేపు కొనసాగే ప్రి క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ వీక్షించడం ఏ యాక్షన్ సినిమా లవర్కైనా కనులకు మంచి ఫీస్ట్‌లా ఉంటుంది. ఛేజింగ్స్‌తో నడిచే ఆ ఎపిసోడ్లో ఎన్ని వాహనాలు ధ్వంసమవుతాయో.. ఈ ఒక్క ఎపిసోడ్‌కే రూ. 70 కోట్లు ఖర్చుపెట్టామని డైరెక్టర్ సుజిత్ వెల్లడించాడు కూడా. 'బ్లాక్‌బాక్స్' కోసం రెండు ముఠాల మధ్య నడిచే పోరాటంలోకి పోలీసులు ఎంటరవడంతో ఇంట్రెస్టింగ్గా అనిపించే ఆ ఎపిసోడ్ 'సాహో' సినిమాకే హైలైట్. దాని తర్వాత క్లైమాక్స్‌లో దృఢకాయులతో ప్రభాస్ చేసే ఫైట్‌ను కూడా చాలా వయొలెంట్‌గా చిత్రీకరించారు. సినిమాలో మరికొన్ని ఫైట్లు ఉన్నా, ఈ రెండు ఫైట్లలోనే ఎక్కువ విధ్వంసం, హింస కనిపిస్తాయి.
డైరెక్టర్ సుజిత్.. తన దృష్టినంతా ఈ రెండు యాక్షన్ సీక్వెన్సెస్ మీదనే కేంద్రీకరించి, మిగతా కథను అల్లుకున్నాడేమో అని అనిపిస్తే అది మన తప్పు కాదు. ఏ సినిమాకైనా 'స్టోరీటెల్లింగ్' అనేది కీలకం. మిగతావన్నీ దానికి హంగులుగా మారి సినిమాకి మరింత ఆకర్షణను తీసుకు వస్తాయి. ఈ విషయంలో సుజిత్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. తను చెప్తున్న కథను ఎలా ఆకర్షణీయంగా చెప్పాలో, దాన్ని వదిలేసి, యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఎంత బాగా తీయాలో అనే దానిపైనే దృష్టంతా పెట్టాడు. ఫలితంగా ఫస్టాఫ్‌లో ప్రభాస్ కేరెక్టర్లో వచ్చే ట్విస్ట్ మినహా మిగతా కథలో పస లేకుండా పోయింది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రెడిక్టబుల్గానే ఉంది. పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాకి మూలమైన ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ 'లార్గో వించ్' చూసినవాళ్లకు ఆ ట్విస్ట్‌ను సునాయాసంగానే ఊహిస్తారు.
ఏతావాతా.. 'బాహుబలి'తో వచ్చిన ఆల్ ఇండియా స్టార్ అనే ట్యాగ్‌కు 'సాహో'తో ప్రభాస్ న్యాయం చెయ్యలేకపోయాడని చెప్పాలి. ఇలాంటి కథ అతనికి ఎలా నచ్చిందనే ప్రశ్న కూడా వస్తోంది.