తెలుగు సినిమాలపై కన్నేసిన హిందీ నిర్మాత
on May 9, 2020
తెలుగు సినిమాలకు హిందీలో మాంచి మార్కెట్ ఏర్పడుతోంది. యువ హీరోలు రామ్, నితిన్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యుట్యూబ్‌లో విడుదల చేస్తే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తే కోట్లకు కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకని, ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్ తెలుగు సినిమాలపై కన్నేశారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో తెలుగుతో పాటు దక్షిణాది సినిమాలు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. అందులో కొన్ని సినిమాలు షార్ట్ లిస్ట్ చేశానని, పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ భూషణ్ కుమార్ దే.
తెలుగు రీమేక్ సినిమాల ద్వారా హిందీ స్టార్ హీరోలు భారీ విజయాలను అందుకున్నారు. సల్మాన్ ఖాన్ అయితే 'పోకిరి'ని 'వాంటెడ్'గా, 'స్టాలిన్'ని 'జై హో'గా, 'రెడీ', 'కిక్' సినిమాలను అవే పేర్లతో రీమేక్స్ చేసి విజయాలు అందుకున్నారు. 'విక్రమార్కుడు'ను అక్షయ్ కుమార్ 'రౌడీ రాథోడ్'గా, 'మర్యాద రామన్న'ను అజయ్ దేవగణ్ 'సన్నాఫ్ సర్దార్'గా రీమేక్ చేసి హిట్లు కొట్టారు.