'బింబిసార' దర్శకుడితో రజినీకాంత్!
on Oct 20, 2022
సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో దర్శకులకు డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఓ యువ దర్శకుడికి తన రెండో సినిమాకే రజినీకాంత్ ని డైరెక్ట్ చేసే అవకాశమొస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట్ తన రెండో సినిమాని ఏకంగా సూపర్ స్టార్ తో చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం పోషించిన 'బింబిసార'తో వశిష్ట్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ పెద్దగా అంచనాల్లేకుండా ఆగస్టులో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపు ఉంటుందని విడుదలకు ముందే ప్రకటించారు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'NKR 19', 'డెవిల్' వంటి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయ్యి 'బింబిసార' పార్ట్-2 పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశముంది. అందుకే ఈలోపు వేరే హీరోతో ఓ సినిమా చేయాలని వశిష్ట్ ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలో ఆయన తాజాగా రజినీకాంత్ ని కలిసి ఓ స్టోరీ వినిపించినట్టు తెలుస్తోంది. మరి సూపర్ స్టార్ ఈ యువ దర్శకుడు చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దర్శకత్వంలో 'జైలర్' సినిమా చేస్తున్నాడు. ఒకవేళ ఆయన వశిష్ట్ కి అవకాశమిచ్చి, ఆ సినిమా విజయం సాధిస్తే.. ఒక్కసారిగా వశిష్ట్ రేంజ్ మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read