సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'భీమ్లా నాయక్'
on Dec 21, 2021

తెలుగు సినిమాల సంక్రాంతి పోరుకి సయోధ్య కుదిరింది. టాలీవుడ్ నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'లకు దారి ఇస్తూ 'భీమ్లా నాయక్' సంక్రాంతి పోరు నుంచి తప్పుకుంది.
కరోనా ప్రభావం నుంచి టాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో సినిమాలు పోటాపోటీగా విడుదల చేసి ఒకరు బిజినెస్ ని మరొకరు బిజినెస్ దెబ్బకొట్టడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరి 7 న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్ఆర్ఆర్', జనవరి 14 న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'రాధేశ్యామ్' సినిమాలు విడుదల కానున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' కూడా మొదట సంక్రాంతి రేసులో ఉంటుందని తెలుపుతూ జనవరి 12 న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
'భీమ్లా నాయక్' పోటీ నుంచి తప్పుకొని పాన్ ఇండియా సినిమాలు అయిన 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'లకు దారి ఇచ్చేలా చూడాలని నిర్మాతలు ఎప్పటినుండో ప్రయత్నాలు చేశారు. 'భీమ్లా నాయక్' వాయిదా పడుతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం తాము చెప్పిన టైం కే వస్తామని తేల్చి చెప్పారు. దీంతో వారం గ్యాప్ లో ఇలా మూడు పెద్ద సినిమాలు విడుదలైతే ఇండస్ట్రీకే నష్టమన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాతల మధ్య సయోధ్య కుదిరింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాట్లాడుతూ నిర్మాతల మధ్య చర్చలు జరిగాయని.. సయోధ్య కుదిరి, భీమ్లా నాయక్ వాయిదా పడుతుందని తాజాగా ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' పాన్ ఇండియా సినిమాలు అని.. హిందీలో కూడా భారీగా విడుదలవుతూ అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ సినిమాల వాయిదా సాధ్యం కాదని అన్నారు. జనవరి 6 న విడుదల కావాల్సిన బాలీవుడ్ మూవీ గంగూభాయి సైతం ఆర్ఆర్ఆర్ కోసం విడుడల వాయిదా వేసుకుందని గుర్తుచేశారు. అలాగే తెలుగులో మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్స్ సమస్య కూడా ఏర్పడుతుందని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే డీవీవీ, యూవీ బ్యానర్స్.. సితారతో మాట్లాడి భీమ్లా నాయక్ విడుదల వాయిదాకి ఒప్పించారని తెలిపారు. ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం సినిమా విడుదల వాయిదాకి ఒప్పుకున్న భీమ్లా నాయక్ హీరో పవన్ గారికి, నిర్మాత చినబాబు గారికి ధన్యవాదాలని దిల్ రాజు పేర్కొన్నారు.

అలాగే భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న విడుదల కానుందని దిల్ రాజు తెలిపారు. ఆ తేదీకి విడుదల కావాల్సిన తమ 'F3' సినిమాని ఏప్రిల్ 29 కి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ 1 న సర్కారు వారి పాట, ఏప్రిల్ 14 న కేజీఎఫ్-2 విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారని.. కాబట్టి 'F3' ని ఏప్రిల్ 29 న విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



