'బంగార్రాజు' వర్సెస్ 'హీరో'.. వైసీపీ, టీడీపీ పోరుగా మారుతోందా?
on Jan 6, 2022

ఆంధ్రప్రదేశ్ లో ఈ సంక్రాంతి సినిమాల పోరు రాజకీయ రంగు పులుముకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరి 14 న అక్కినేని నాగార్జున నటించిన 'బంగార్రాజు', జనవరి 15 న గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ 'హీరో' విడుదల కానున్నాయి.
సినిమా టికెట్ ధరల తగ్గింపుతో నాకేం ఇబ్బంది లేదని 'బంగార్రాజు' మూవీ ప్రెస్ మీట్ లో నాగార్జున వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తో సన్నిహితంగా ఉంటారు కాబట్టే నాగార్జున ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం నాగార్జున సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారని, అందుకే ఆయనకి ఇబ్బంది లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి కొందరు నాగార్జునను సపోర్ట్ చేస్తూ, మరికొందరు వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బంగార్రాజు సినిమా సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంట్స్ ని ఎదుర్కొంటోంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా 'హీరో' సినిమా నుంచి ఓ రాప్ సాంగ్ విడుదలైంది. ఆ లిరికల్ వీడియోలో చిరంజీవి, రజినీకాంత్, వెంకటేష్, బాలకృష్ణ రిఫరెన్స్ లు ఉన్నాయి. అయితే అందులో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున రిఫరెన్స్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గల్లా జయదేవ్ టీడీపీ నేత కావడంతో ఉద్దేశపూర్వకంగానే ఆయన కుమారుడి మూవీలో వైసీపీ సపోర్టర్ నాగార్జున రిఫరెన్స్ లేకుండా చేశారని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా జరిగిన హీరో మూవీ ప్రెస్ మీట్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, రోల్ రైడా రాసిన లిరిక్స్ ని బట్టి వీడియోలో హీరోల పోస్టర్స్ చూపించామని, దీని వెనక ఎలాంటి కాంట్రవర్సీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ రాప్ సాంగ్ కూడా 'టికెట్ ధరలతో నాకేం ఇబ్బంది లేదని' నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడానికంటే విడుదలైందని గుర్తు చేస్తున్నారు.
ఇక 'హీరో' సినిమా నిర్మాత, గల్లా అశోక్ తల్లి 'గల్లా పద్మ' కూడా ప్రెస్ మీట్ లో నాగార్జున బంగార్రాజు సినిమా గురించి ప్రస్తావించడం విశేషం. నాగార్జున గారి సినిమా కూడా సంక్రాంతికి విడుదలవుతుందని, అయితే ఈ పండగకి తెలుగు ప్రేక్షకులకు సినిమా చూడటం ఆనవాయితీ కాబట్టి.. రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆదరిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.
బంగార్రాజు, హీరో సినిమాల సంక్రాంతి పోరుని వైసీపీ వర్సెస్ టీడీపీ పోరుగా చూడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ కూడా వైసీపీ సపోర్టర్స్ అనే ముద్ర ఉంది. కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా 'హీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గల్లా అశోక్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఎలా అవుతాడన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ సైతం సంక్రాంతికి 'సర్కారు వారి పాట' రావట్లేదని నిరాశ చెందిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని హీరో సినిమా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నాడు. ఏది ఏమైనా సినిమాలని సినిమాల్లాగే చూడాలని, రాజకీయ రంగు పులమడం సరికాదని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



