బాలయ్య - తేజ మధ్య ఏం జరిగింది?
on Apr 26, 2018
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ అర్థాంతరంగా బయటకు వచ్చేసిన వార్త... టాలీవుడ్ కి షాకిచ్చింది. బాలయ్యతో సినిమా, అందులోనూ ఎన్టీఆర్ జీవిత కథని సినిమాగా తీసే అదృష్టం. ఇంతకంటే తేజకు ఇంకేం కావాలి?? ఎన్టీఆర్కి వీరాభిమానిని.. ఈ సినిమా తీయడం నా అదృష్టం అని ఓపెనింగ్ వేడుకలో చెప్పుకున్న తేజ - ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే ఇది ఇప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో రోజుల అంతఃమధనం. మరి తేజ ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు వచ్చేయాలనుకున్నాడు? అసలైన కారణాలేంటి?
తేజకి ఎన్టీఆర్ బయోపిక్ చేయడం ముందు నుంచీ ఇష్టం లేదు. ఇది చాలా పెద్ద బాధ్యత.. నేను మోయలేనేమో అని ముందు నుంచీ బాలయ్యకు చెబుతూనే వస్తున్నాడట తేజ. కానీ బాలయ్య మాత్రం బలవంతంగా ఈ బాధ్యత తేజ నెత్తిమీద పెట్టాడు.
తేజ స్కూలు వేరు. తన కథలు తానే రాసుకుంటాడు. కొత్త వాళ్లతోనే ప్రయోగాలు చేస్తాడు. ఇక్కడ స్లార్లను హ్యాండిల్ చేయాల్సిరావడం ఒత్తిడిలా ఫీలయ్యాడు తేజ. అంతేకాదు.. బాలయ్యకు దూకుడు ఎక్కువ. ఎదురెళ్లి మాట్లాడడం ఎవరికైనా కష్టమే. తాను చెప్పినట్టు మిగిలినవాళ్లు వినాలనుకుంటాడు తేజ. బాలయ్య దగ్గర ఈ రూలు వర్కవుట్ అవ్వదు.
ఈమధ్య నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక పట్ల తేజ, బాలకృష్ణ మధ్య అభిప్రాయ బేధాలొచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ విషయంలోనూ బాలయ్యదే అంతిమ నిర్ణయం కావడం, తన అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం తేజకు నచ్చలేదని సమాచారం. సినిమా అంతా ఒకరి చెప్పు చేతల్లోనే నడవడం కష్టం అనుకున్న తేజ... ఇక ఈ బాధ్యతలు మోయలేనని, ముందే చెప్పి బయటకు వచ్చేశాడట. పది రోజుల క్రితమే... ఈ సినిమా నుంచి తేజ తప్పుకున్నాడని, కాకపోతే ఈ వార్తే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.