బాలకృష్ణ, బోయపాటి స్టైల్ మార్చారు!
on Mar 18, 2020
నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్స్‌కి కేరాఫ్ అడ్రస్. 'సింహా', 'లెజెండ్'.. ఇలా జట్టుకట్టిన రెండు సార్లూ సెన్సేషనల్ హిట్స్ అందుకున్న వైనం ఈ కాంబో సొంతం. అలాంటి ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో.. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమా వస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మలి దశ చిత్రీకరణకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. బాలయ్య, బోయపాటి గత రెండు సినిమాల్లో ఉండే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్.. కొత్త చిత్రంలో మిస్ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. హ్యాట్రిక్ మూవీ కోసం బాలయ్య, బోయపాటి కాస్త స్టైల్ ని మారుస్తున్నారనే చెప్పాలి.
ఆ వివరాల్లోకి వెళితే.. అటు 'సింహా' (2010) గానీ, ఇటు 'లెజెండ్' (2014) గానీ ఆయా సంవత్సరాల్లో వేసవి కాలంలోనే విడుదలయ్యాయి. సమ్మర్ సెన్సేషన్స్‌గా నిలిచాయి. అయితే, రాబోయే చిత్రం మాత్రం వేసవి సెలవుల్లో విడుదల కావడం లేదు. వర్షాకాలంలో ఈ సినిమాని విడుదల చేసే దిశగా నిర్మాణం జరుగుతోంది. సో.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మూవీకి ఈ సారి సీజన్ ఛేంజ్ జరుగుతోంది.
ఇక 'సింహా', 'లెజెండ్' సినిమాలకు సంబంధించి గతంలో బాలకృష్ణతో కలిసి పనిచేయని సంగీత దర్శకులే జట్టుకట్టారు. 'సింహా' కోసం బాలయ్య కాంబినేషన్ లో చక్రి తొలిసారి వర్క్ చేస్తే.. 'లెజెండ్' విషయంలో దేవి శ్రీప్రసాద్‌కి కూడా అదే జరిగింది. అయితే థర్డ్ వెంచర్‌కి మాత్రం ఇప్పటికే బాలయ్య కాంబోలో 'డిక్టేటర్' చేసిన థమన్‌ని ఎంచుకున్నాడు బోయపాటి శ్రీను. సో... ఈ సారి బాలకృష్ణకి ఫ్రెష్ మ్యూజికల్ కాంబో మిస్సవుతోందన్నమాట.
అదే విధంగా 'సింహా', 'లెజెండ్' చిత్రాల్లో అప్పటివరకు బాలయ్యతో రొమాన్స్ చేయని భామలే సందడి చేశారు. 'సింహా'లో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత ఫస్ట్ టైమ్ నటసింహతో ఆడిపాడితే.. 'లెజెండ్'లో నాయికలుగా నటించిన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కూడా సేమ్ కేటగిరి. కట్ చేస్తే.. కొత్త చిత్రంలో మాత్రం ఇప్పటికే బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రియ, అంజలి నాయికలుగా నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. సో.. ఈ సారి కథానాయికల పరంగా బాలయ్యకి ఫ్రెష్ పెయిర్ మిస్సవుతోందన్నమాట.
మొత్తమ్మీద.. సీజన్, పెయిర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా గత రెండు చిత్రాలలో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్.. బాలయ్య, బోయపాటి థర్డ్ జాయింట్ ప్రాజెక్ట్‌లో మిస్ అవుతున్నాయి. మరి.. స్టైల్ మార్చి వస్తున్న బాలయ్య, బోయపాటికి ఈ సారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. గత రెండు చిత్రాల్లో బాలయ్య డ్యూయెల్ రోల్స్‌లో దర్శనమిస్తే.. ఈ సారి కూడా సేమ్ ఫీట్ రిపీట్ అవుతోందని టాక్. అలాగే 'సింహా' (యునైటెడ్ మూవీస్), 'లెజెండ్' (14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, వారాహి చలన చిత్రం)ని అంతవరకు పనిచేయని బేనర్స్‌లోనే చేస్తే... ఇప్పుడు మూడో చిత్రాన్ని కూడా ద్వారక క్రియేషన్స్ (మిర్యాల రవీందర్ రెడ్డి) లాంటి ఇదివరకు వర్క్ చేయని సంస్థలోనే చేస్తున్నాడు బాలయ్య. సో... ఈ రెండు విషయాల్లో మాత్రం పాత్ర చిత్రాల తీరు కొనసాగుతోందన్నమాట.
Also Read