రీ రిలీజ్‌లోనూ ‘బాహుబలి’దే రికార్డు.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
on Nov 20, 2025
ఇటీవలికాలంలో స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చెయ్యడం మనం చూస్తున్నాం. కొన్ని సినిమాలు రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి1’, ‘బాహుబలి2’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 2015లో విడుదలైన బాహుబలి1 600 కోట్లు కలెక్ట్ చెయ్యగా, 2017లో రిలీజ్ అయిన బాహుబలి2 1800 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.
బాహుబలి సిరీస్‌ను ఎడిట్ చేసి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కొత్త సినిమాలను కూడా దాటుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది. అక్టోబర్ 31న విడుదలైన ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ‘బాహుబలి ది ఎపిక్’కి కూడా రెగ్యులర్ సినిమాల్లాగే ప్రమోషన్స్ చేశారు. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. రీరిలీజ్‌లో ఇంత మొత్తం కలెక్షన్స్ రావడం ఒక రికార్డుగానే చెప్పాలి. ఇప్పటివరకు ఏ సినిమాకీ రీరిలీజ్‌లో ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. ఇక ఏరియా వైజ్‌గా ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపి 9 కోట్ల 80 లక్షలు, హిందీలో 8 కోట్ల 45 లక్షలు, ఓవర్సీస్‌లో 12 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి రీరిలీజ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించింది బాహుబలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



