న్యూజిలాండ్‌లో కొనసాగనున్న 'అవతార్' షూటింగ్
on May 9, 2020
గడచిన మార్చిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమాల షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లు కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయాయి. వాటిలో న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న జేమ్స్ కామెరాన్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'అవతార్' సీక్వెల్ కూడా ఒకటి. కాగా న్యూజిలాండ్ గవర్నమెంట్ విడుదల చేసిన కొత్త ఆరోగ్య, సురక్షిత విధానాలు సినిమా షూటింగ్‌లు కొనసాగడానికి వీలు కల్పించాయి. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ఫిల్మ్ కమిషన్ (ఎన్‌జడ్ఎఫ్‌సీ) ధ్రువీకరించింది. కొన్ని సినిమా, టీవీ ప్రొడక్షన్లు ఇప్పటికే సురక్షితంగా నడుస్తున్నాయని అది పేర్కొంది. అక్కడి ప్రభుత్వం నిర్దేశించిన రక్షిత విధానాలను పాటిస్తూ సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధిస్తోన్న కొన్ని దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఇప్పటి దాకా అక్కడ 1,139 కొవిడ్-19 కేసులు, 21 కరోనా మరణాలు మాత్రమే నమోదవడం గమనార్హం.
ఇప్పుడక్కడ 'అవతార్' సీక్వెల్ షూటింగ్ కొనసాగించడానికి జేమ్స్ కామెరాన్ బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సీక్వెల్‌లో ఒరిజినల్‌లో నటించిన శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, జోయల్ డేవిడ్ మూర్, దిలీప్ రావ్, స్టీఫెన్ లాంగ్, మాట్ గెరాల్డ్, సిగౌర్నీ వీవర్ తమ పాత్రల్ని నిలబెట్టుకోగా, కొత్తగా కేట్ విన్‌స్లెట్, ఎడీ ఫాల్కో, మిషెల్లీ యో, విన్ డీజెల్, జెమైన్ క్లెమెట్, ఊనా చాప్లిన్ అడుగు పెడుతున్నారు. విన్ డీజెల్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి 'అవతార్ 2'ను ఈ ఏడాది డిసెంబర్ 18న రిలీజ్ చేయాలని మొదట ప్రకటించారు. ఇప్పుడు సవరించిన షెడ్యూల్ ప్రకారం దాని విడుదల 2021 డిసెంబర్ 17కు మారింది. అలాగే 'అవతార్ 3' మూవీ 2021 డిసెంబర్ 17 నుంచి ఏకండా రెండేళ్లు వాయిదా పడి 2023 డిసెంబర్ 22కు మారింది. ఈ రెండు సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర ప్రదర్శించే ఫలితాల్ని బట్టి 'అవతార్ 4', 'అవతార్ 5' సినిమాల నిర్మాణం ఆధారపడి ఉంటుంది.
కాగా 'అవతార్ 2' మూవీతో పాటు అమెజాన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సీక్వెల్ షూటింగ్ కూడా న్యూజిలాండ్‌లో కొనసాగనున్నట్లు సమాచారం.