'అథర్వ' మూవీ రివ్యూ
on Dec 1, 2023
సినిమా పేరు: అథర్వ
తారాగణం: కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, శివ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డీఓపీ: చరణ్ మాధవనేని
దర్శకత్వం: మహేష్ రెడ్డి
నిర్మాత: సుభాష్ నూతలపాటి
బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇదే బాటలో ఇప్పుడు అథర్వ వచ్చింది. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. నేడు(డిసెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) పోలీస్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతనికి ఆస్తమా ఉంటుంది. దీని కారణంగా పోలీస్ సెలక్షన్లలో ఫెయిల్ అవుతాడు. కానీ పట్టు పట్టి క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు. తన తెలివితో కేసులను క్షణాల్లో పరిష్కరిస్తుంటాడు. ఈ క్రమంలోనే తన కాలేజ్ మేట్ అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా మళ్లీ తన జీవితంలోకి వస్తుంది. ఆమె మీదున్న ప్రేమను మాత్రం బయటకు చెప్పలేకపోతాడు కర్ణ. నిత్య ఫ్రెండ్ జోష్ని(ఐరా) పెద్ద హీరోయిన్. జోష్ని ఇంట్లోనే జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. అక్కడ మర్డర్ జరిగిందని, వేరే వ్యక్తి చంపాడని ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసును అలా ముగించేస్తారు. కానీ నిత్య మాత్రం ఆ విషయాన్ని నమ్మదు. ఇక కర్ణ సైతం ఆ కేసును సాల్వ్ చేయాలని అనుకుంటాడు. అసలు జోష్ని, శివల నేపథ్యం ఏంటి? వాళ్లిద్దరినీ ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసును కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
దర్శకుడు మహేష్ రెడ్డి రాసుకున్న కథాకథనాలు బాగున్నాయి. ఈ ఫార్మాట్లో ఇది వరకు చాలానే కథలు వచ్చాయి. కానీ ఓ పోలీస్ కాకుండా.. ఓ క్లూస్ టీం ఆఫీసర్ ఎలాంటి క్లూలు లేని కేసుని ఇన్వెస్టిగేట్ చేయడమే కొత్తగా ఉంటుంది. సినిమాలో కొన్ని లోపాలున్నాయి. కానీ ఎంగేజింగ్‌గా తీయడంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు.
ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. అసలు కథ ప్రారంభించడానికి కాస్త టైం తీసుకుంటాడు దర్శకుడు. రాబరీ కేసు నుంచి సినిమా పుంజుకుంటుంది. హీరోయిన్ జోష్ని, ఆమె ప్రియుడు మరణంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తరువాత కథనంలో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉండటం కొసమెరుపు.
టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరామెన్ చరణ్ మాధవనేని ఇచ్చిన విజువల్స్ సినిమా మూడ్‌ను క్యారీ చేశాయి. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం మెప్పించింది. ఎడిటింగ్ కూడా షార్ప్ అండ్ క్రిస్పీగానే ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
నటీనటులు
అథర్వ పాత్రలో కార్తీక్ రాజు చక్కగా రాణించాడు. ఫ్రెండ్స్‌తో ఉన్న టైంలో కామెడీ, కేసును చేదించే టైంలో సీరియస్ నెస్, ప్రేయసితో ఉన్నప్పుడు లవ్ యాంగిల్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది. ఇక సినిమాలో హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. మిగిలిన పాత్రదారులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే అథర్వ సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే అవకాశముంది.
రేటింగ్: 2.5/5