ఏందిరా అర్జున్ రెడ్డి? ఈ రచ్చా!
on Aug 24, 2017

చిన్న సినిమాలు చిలువలు పలువలుగా వస్తుంటాయ్.. పోతుంటాయ్. అందులో ఒకట్రెండు సినిమాలు ఉన్నట్లుండి మెరుస్తుంటాయ్. అది ఓకే... కానీ.. చిన్న సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ రావడం మాత్రం పెద్ద విచిత్రమే. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఏంటీ సినిమాకు ఇంత క్రేజూ... అని పెద్ద పెద్దోళ్లే ఆశ్చర్యపోతున్నారు. కొత్త దర్శకుడు. ‘పెళ్లి చూపులు’ తప్ప సరైన ఒక్క సినిమా చేయని హీరో. కొత్త హీరోయినూ... మరి ఏంజూసి ఈ క్రేజు? ప్రతి ఒక్కరిలో ఇదే ప్రశ్న.
ఈ సినిమా ప్రమోషన్ మొదలైనప్పట్నుచీ వివాదాలే వివాదాలు. అవే ఈ సినిమా పాలిటి ప్రమోదాలయ్యాయేమో. ఈ సినిమా వేడుకలో హీరో విజయ్ దేవరకొండ... ‘సినిమా గట్టిగా హట్టే. ఎంత పందేనికైనా రెడీ. నా అకౌంట్లో డబ్బులన్నీ ఇచ్చేస్తా’అని సవాల్ విసిరి.. తొలి వివాదానికి తెరలేపాడు. ఇక అప్పట్నుంచి మొదలైంది రచ్చ. సోషల్ మీడియాలో చాలామంది రకరకాల కామెంట్లతో విజయ్ ని ఆడేసుకున్నారు. ‘ఎందుకురాబయ్.. నీకింత ఓవర్ కాన్పిడెన్స్’ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు. మరి అప్పటికైనా ఈ కుర్రోడు ఆగాడా అంటే... అదీలేదు!. ఆడియో వేడుకలో ఇంకాస్త చెలరేగిపోయాడు. నోటికొచ్చిన బూతులు మాట్లాడేసి పెద్ద చర్చకే కారణమయ్యాడు. అంతటితో కూడా ఆగలేదు ఈ పిల్లగాడు. సినిమాలో ఉన్న బూతుమాటల్ని జనాల్తో కూడా అనిపించి రచ్చ రంబోలా చేశాడు.
ఇవి చాలవు అన్నట్టూ... మరో వైపు మన కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు... రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ పక్కనబెట్టి.. పనిగట్టుకొని ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లపైనే పడ్డాడు. హీరోహీరోయిన్ల ‘లిప్ లాక్’ పోస్టర్లంటినీ చించి, కార్యకర్తలతో తగలపెట్టించి, ‘ఇదేనా సంస్కృతి?’ అంటూ మీడియా ముందు మీటింగులు పెట్టేశాడు. మరి ఈ సినిమాపై ఇంత రచ్చ జరుగుతోంటే... అసలోడు ఎంటర్ కాకపోతే ఎలా చెప్పండి?... అందుకే ఎంటరైపోయాడు మన రామ్ గోపాల్ వర్మ... ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లు చింపిన హనుమంతరావుని సోషల్ మీడియా సాక్షిగా టార్గెట్ చేశాడు. ‘జీవితంలో ఒక్కసారి కూడా అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకోలేదనే ఫ్రెస్టేషన్ తో హనుమంతరావు... ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లను చింపుతున్నాడు. అందుకే... ‘అర్జున్ రెడ్డి’ టీమ్ హనుమంతరావు బట్టలు చించండి. తాతయ్యా... మీ మనవ సంతానాన్ని అడుగు.. ఆ పోస్టర్లు బాగున్నాయో లేదో చెబుతారు’ అంటూ... ఏవేవో వ్యాఖ్యలు చేసేశాడు వర్మ. వర్మ ఇలా టార్గెట్ చేసేసరికి... హనుమంతరావు స్పందన కోసం అందరూ వేచిచూశారు. అందరూ అనుకున్నట్లే... 24 గంటలు గడవక ముందే మన హనుమంతరావుగారు ఈ విషయంపై తీవ్రంగా రియాక్టయిపోయారు. ‘సిగ్గు లేదురా బయ్... ’అంటూ అంతెత్తు లేచాడు. నోటికొచ్చిన మాటలన్నీ అనేశాడు. ఈ గొడవలంతా కేవలం ఒక్క సినిమా గురించి వచ్చినవే కావడం గమనార్హం.
ఇక ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్. ఏ చిన్న సినిమా ట్రైలర్ కీ.. ఇప్పటివరకూ రానన్ని వ్యూస్ ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ కి వచ్చాయ్. దాదాపు 50 లక్షల మంది ఈ ట్రైలర్ చూశారు. దానికి తగ్గట్టే ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. దేవరకొండ విజయ్ నటన, వంగా సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ ట్రైలర్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది. యువతరం అయితే... ఈ ట్రైలర్ ని మళ్లీ మళ్లీ చూస్తున్నారని టాక్. దీనితో పాటు... బయట పోస్టర్ పబ్లిసిటీ విషయంలో కూడా దర్శక, నిర్మాతలు బోల్డ్ గా వెళ్లారు. హీరోహీరోయిన్ల లిప్ లాక్ ని జూమ్ చేసి మరీ చూపిస్తున్నట్లున్నాయ్ ఆ పోస్టర్లు. సెన్సార్ వాళ్లు కూడా ఈ సినిమాకు ‘ఏ’సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇక యూత్ కి ఇంతకంటే ఏం కావాలి? ఈ కారణాలన్నీ ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై అంచనాలను ఆకాశంలో నిలబెట్టాయ్.
అసలు ‘అర్జున్ రెడ్డి’ కథ ఏంటి? పొగరబోతుగా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ.. అదే ట్రైలర్లో డ్రగ్స్ కి బానిసై కనిపిస్తున్నాడు. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి వంక ఎవరూ చూడొద్దంటూ కాలేజీలో హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఆ మెడికల్ కాలేజీ వాతావరణం.. దేవరకొండ తలబిరుసు, యాటిడ్యూడ్. సాటి ఆటగాళ్లతో అతని బిహేవియర్... అంతా ఇందులో ఏదో ఉందనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్. రేపు ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాబోతోంది. విడుదలకు ముందే హంగామాకు కారణమైన ఈ సినిమా... విడుదలకు ముందు ఇంకెత రచ్చ జేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



