‘యానిమల్’ మూవీ రివ్యూ
on Dec 1, 2023
సినిమా పేరు: యానిమల్
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు
సంగీతం: JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్
రచన,ఎడిటింగ్ , దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ
బ్యానర్: భద్రకాళి పిక్చర్స్ ,సినీ వన్ స్టూడియోస్
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
విడుదల తేదీ: డిసెంబర్ 1
అర్జున్ రెడ్డి తో తెలుగు చిత్ర సీమకి, కబీర్ సింగ్ తో హిందీ చిత్ర సీమకి ఒక కొత్త టేస్ట్ ని మరియు టేకింగ్ ని పరిచయం చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఒక హిందీ హీరోతో పాన్ ఇండియా సినిమా చేస్తూ ఆ సినిమాకోసం హిందీ ప్రేక్షకులు ఎలా అయితే ఎదురుచూస్తుంటారో...అలాగే తెలుగు ప్రేక్షకుల కూడా ఎదురుచూసేలా చేసిన ఘనత సందీప్ రెడ్డి ది.యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఆడియన్స్ లో యానిమల్ ఫీవర్ ని క్రియేట్ చేసిన సందీప్ ఇప్పుడు ఎంతవరకు ప్రేక్షకులని రంజింప చేసాడో చూద్దాం.
కథ
బల్బీర్ సింగ్ ( అనిల్ కపూర్) ఇండియాలోనే ఒక పెద్ద బిజినెస్ మాన్. కొన్ని కోట్ల రూపాయిల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. బల్బీర్ కి కొడుకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్ ) ఇద్దరు కూతుళ్లు ఉంటారు. విజయ్ కి తన తండ్రి అంటే ఎంతో ప్రేమ కానీ తండ్రి దృష్టిలో రౌడీ అనే ముద్ర పడి అమెరికాలో చదువుకొని ఇండియాకి వస్తాడు.తన అక్క భర్త వల్ల తనకి తండ్రి మధ్య గ్యాప్ అలాగే ఉంటుంది.ఈ క్రమంలో తన చిన్న నాటి స్నేహితురాలు గీతాంజలిని (రష్మిక) పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిన విజయ్ తన తండ్రి మీద హత్యాప్రయత్నం జరగడంతో ఇండియా వచ్చి తన తండ్రిని శత్రువుల బారి నుంచి కాపాడాడా? అసలు తన శత్రువులని విజయ్ కనిపెట్టాడా? చివరకి ఏం జరిగింది అనేదే ఈ చిత్ర కథ? .
ఎనాలసిస్ :
ఇది పక్కా సందీప్ రెడ్డి తరహా మార్క్ కథ. సినిమాలోకి వెళ్లే కొద్దీ అది స్పష్టంగా ఆడియెన్స్ కి అర్ధం అవుతుంది. సినిమా ఓపెనింగ్ సీన్ లోనే దర్శకుడు ఈ చిత్ర కథ ని చెప్పేయడంతో సినిమా చివరి దాకా ఎలా సాగబోతుందో అనే విషయం ప్రేక్షకులకి అర్ధం అయిపోతుంది. తండ్రిని రక్షించుకోవడమే ధ్యేయంతో రణబీర్ చేసే విధ్వంసాలన్నీ కూడా చాలా ఆర్టిఫీషియల్ గా ఉంటాయి. రష్మిక తో రణబీర్ లవర్ హోదాలో అలాగే భర్త హోదాలో చేసే సీన్స్ అన్నీ కూడా ప్రేమ అనేది ఈ విధంగా కూడా ఉంటుందా అనే అనుమానాన్ని ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. పైగా తన కొడుకులో ఉన్న జంతువు రూపాన్ని మార్చుకోవడానికి బల్బీర్ ఎలాంటి ప్రయత్నాలు చెయ్యకపోవడం చూస్తే సినిమా నడవాలంటే ఆయన అలాగే తన కొడుకుని తిట్టడం తప్ప ఏం చెయ్యకూడదేమో అని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో తనని అంతమొందించడానికి వచ్చిన ఒక లేడీ తో విజయ్ రొమాన్స్ చేసే సీన్స్ అన్ని కూడా సినిమా నిడివిని పెంచటానికి పెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమా మొత్తం స్టయిలిష్ట్ గా ఉన్నా కూడా కథ నడిచే విధానంలో ప్రేక్షకుడు ఆ విషయాన్ని మర్చిపోయేలా చెయ్యడం కూడా ఈ సినిమాకి ఉన్న అర్హత
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రణబీర్ , రష్మిక ,అనిల్ కపూర్ ,బాబీడియోల్ తో సహా అందరు సూపర్ గా నటించారు. చివరకి రణబీర్ ఇంట్లో పని మనుషులుగా చేసిన వాళ్ళు కూడా సూపర్ గా నటించారు. సందీప్ రెడ్డి డైరెక్షన్ అండ్ ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా నిలిచింది. రణబీర్ తన నటనలో దాగి ఉన్న ఇంకో కోణాన్ని ప్రేక్షకులకి చూపించాడు. ముఖ్యంగా తండ్రి ప్రేమ కోసం తపన పడటంతో పాటు తండ్రి ప్రాణాలకి ఏం కాకూడదని తన తండ్రిని చంపడానికి చూసే వాళ్ళని చంపడంతో పాటుగా ,భార్య ని ప్రేమించే క్యారెక్టర్లో ను ఇలా అన్నీ వేరియాక్షన్స్ లో రణబీర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు .ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజ స్కందాలపై వేసుకొని చివరివరకు తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసాడు. రష్మిక కెరీర్ లో ఈ మూవీలోని గీతాంజలి క్యారక్టర్ నిలిచిపోతుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజ్య కాంక్ష కోసం పాండవులు, కౌరవులు మధ్య ఆనాడు మహా భారత యుద్ధం జరిగితే ఈనాడు స్వస్తిక్ అనే ఒక వ్యాపార సామ్రాజ్యం కోసం దాయాదుల మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ. కాకపోతే ఈ పోరాటంలో హింస, రొమాన్స్ ఫ్రీ..చివరిగా చెప్పాలంటే ప్రయాణికుడు క్షేమంగా ఇంటికి చేరాలంటే అతని భవిష్యత్తు డ్రైవర్ చేతిలో ఉన్నట్టే ఈ సినిమా భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది.
రేటింగ్ 2 .75 - అరుణాచలం