మళ్లీ మహేశ్‌ని డామినేట్ చేస్తున్న బన్నీ!
on Mar 14, 2020
సంక్రాంతి సెలవుల్లో విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ 'అల వైకుంఠపురములో' సినిమాలు రెండు సూపర్ హిట్టయ్యాయి. ఇద్దరు హీరోల కెరీర్‌లో అవి బిగ్గెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. రెంటి మధ్య పోటీలో బన్నీ సినిమా పైచేయి సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు తేల్చారు. 'అల వైకుంఠపురములో' సినిమా విజయంలో తమన్ స్వరాలు కూర్చిన పాటలు ప్రధాన పాత్ర వహించాయి. ఆ మూవీలోని పాటలన్నీ సంగీత ప్రియుల ఆదరణ పొందాయి. ముఖ్యంగా సీతారామశాస్త్రి రాసిన 'సామజవరగమన', కాసర్ల శ్యామ్ రాసిన 'రాములో రాములా' పాటలు ఆన్‌లైన్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి.
ఇప్పడు పాటల విషయంలో మరోసారి బన్నీ సినిమా మహేశ్ సినిమాపై ఆధిక్యత సాధించింది. సినిమా విడుదల తర్వాత ఆ రెండు సినిమాల పాటల హక్కులు పొందిన మ్యూజిక్ కంపెనీలు వాటి వీడియో సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చాయి. 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి సంబంధించి నాలుగు వీడియో సాంగ్స్, 'అల వైకుంఠపురములో' చిత్రానికి సంబంధించిన ఐదు వీడియో సాంగ్స్ మన ముందుకు వచ్చాయి. మరోసారి వ్యూస్ పరంగా బన్నీ సినిమా పాటలు మహేశ్ సినిమా పాటలపై డామినేషన్ ప్రదర్శిస్తున్నాయి. గమనించాల్సిన విషయమేమంటే లిరికల్‌గా 'సామజవరగమన', 'రాములో రాములా పాటలు' టాప్‌లో నిలిస్తే, వీడియో సాంగ్స్ పరంగా ఆ రెండు పాటల కంటే 'బుట్ట బొమ్మ' సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఫిబ్రవరి 25న యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికి 51 మిలియన్ వ్యూస్ సాధించింది. ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన 'సామజవరగమన' సాంగ్ 33 మిలియన్ వ్యూస్, మార్చి 3న రిలీజయిన 'రాములో రాములా' వీడియో సాంగ్ 23 మిలియన్ వ్యూస్ సాధించాయి. అలాగే ఫిబ్రవరి 23న విడుదలైన 'ఓ మై గాడ్ డాడీ' సాంగ్ 9 మిలియన్ వ్యూస్, ఫిబ్రవరి 27న రిలీజైన 'అల వైకుంఠపురములో' టైటిల్ సాంగ్ 7.9 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి.
మరోవైపు దేవి శ్రీప్రసాద్ స్వరాలు కూర్చిన 'సరిలేరు నీకెవ్వరు' వీడియో సాంగ్స్‌లో ఏ ఒక్కటీ 50 మిలియన్ వ్యూస్ కాదు కదా, 30 మిలియన్ వ్యూస్ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. అత్యధికంగా జనవరి 30న రిలీజ్ చేసిన 'డాంగ్ డాంగ్' సాంగ్ 24 మిలియన్ వ్యూస్ సాధించగా, ఫిబ్రవరి 28న విడుదలైన 'మైండ్ బ్లాక్' సాంగ్ రెండు కంపెనీల ప్లాట్‌ఫామ్స్ (లహరి, టి-సిరీస్)పై కలిపి 21 మిలియన్ వ్యూస్ సాధించింది. మార్చి 3న విడుదల చేసిన 'సూర్యుడివో చంద్రుడివో' సాంగ్‌కు 2.9 మిలియన్ వ్యూస్, మార్చి 7న రిలీజైన 'హి ఈజ్ సో క్యూట్' సాంగ్‌కు 4 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.
ఈ విధంగా అటు కలెక్షన్ల పరంగానూ, ఇటు సాంగ్స్ పరంగానూ మహేశ్ మూవీపై బన్నీ సినిమా ఆధిపత్యం ప్రదర్శిస్తోందని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
