పద్మనాభంకు అన్నంపెట్టి ఆదుకున్న కన్నాంబ!
on Oct 10, 2020
కడప జిల్లా సింహాద్రిపురంలో 1931 ఆగస్ట్ 20న పుట్టారు ప్రఖ్యాత హాస్యనటుడు పద్మనాభం. ఆరో ఏట 'చింతామణి' నాటకంలో శ్రీకృష్ణుడు వేషం వేయడం ద్వారా ఆయన వేషాలు మొదలయ్యాయి. ఐదో తరగతితోనే ఆయన చదువు ఆగిపోయింది. చిత్తూరు నాగయ్య టైటిల్ రోల్ చేసిన 'భక్త పోతన' సినిమాని 50 సార్లు చూశారు. ఆ సినిమాలో నాగయ్య పాడిన పద్యాలు, పాటలు పాడుతూ అనుకరించేవారు. ఆయననూ, 'చండిక'లో కన్నాంబను చూశాక ఆవిడనూ ఎలాగైనా కలవాలని తాపత్రయపడ్డారు పద్మనాభం. 1943లో పన్నెండేళ్ల వయసులో మద్రాస్ వెళ్లారు. మొదట్లో ఓ సైకిల్ మీద తిరుగుతూ ఈ పాటలు, పద్యాలు పాడుతూ, డబ్బులు పోగు చేసుకుంటూ కాలం గడిపారు.
పద్మనాభం తొలిసారి కలుసుకున్న ఆర్టిస్ట్ కన్నాంబ గారే. ఆమె ముందు పాడారు పద్మనాభం. ఆమె తన చేత్తో ఆయనకు అన్నం పెట్టారు. తన భర్త కడారు నాగభూషణంకు పద్మనాభం పాట సంగతి చెప్పారామె. వాళ్లంతా అప్పుడు 'పాదుకా పట్టాభిషేకం' షూటింగ్‌లో ఉన్నారు. అప్పటి మహామహులు అద్దంకి శ్రీరామమూర్తి, సీఎస్సార్ ఆంజనేయులు, దాసరి కోటిరత్నం, కె. రఘురామయ్య, కన్నాంబ సమక్షంలో మళ్లీ పాడారు పద్మనాభం. అందరూ స్వరం చాలా బాగుందని మెచ్చుకున్నారు, ఆశీర్వదించారు. ఆ సినిమాలో ఓ పాట కోరస్‌లో పాడే చాన్స్ వచ్చింది. జెమినీ స్టూడియోలో రికార్డ్ చేశారు.
అక్కడ పద్మనాభంను చూసిన లింగం సుబ్బారావు అనే ఆయన ప్రఖ్యాత దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మంకు పరిచయం చేశాడు. నెలకు 40 రూపాయల జీతంపై 'మాయలోకం' (1945)లో వేషం ఇచ్చారు గూడవల్లి. అందులో రాజకుమారుడుగా సీఎస్సార్ చిన్నప్పటి వేషం వేశారు పద్మనాభం. అదే సినిమాల్లో ఆయన తొలి వేషం. అందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో. బాలనటుడిగా యోగి వేమన, త్యాగయ్య, నారద నారది, వింధ్యరాణి, రాధిక, భర్త సిరియాళ సినిమాల్లో నటించారు పద్మనాభం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
