ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకునే వైసీపీ నేతలు నిద్రపోతున్నారా?
on Jan 3, 2022

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక లెజెండరీ యాక్టర్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాలపై దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటన తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా దుర్గిలోనూ మరో ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వైసీపీ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సంచలనంగా మారింది.
దుర్గి మండల వైసీపీ జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం దుర్గిలోని బస్టాండ్ సెంటర్ కు వెళ్లి సుత్తి తీసుకుని అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసమయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న దుర్గి పోలీసులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అధికార పార్టీకి చెందిన నాయకుడు ఓ మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ స్పందించారు. "మన తెలుగు జాతి దేవుడు, తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుంటూరు జిల్లా దుర్గిలో పట్టపగలు ధ్వంసం చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటమనేది మన తెలుగు జాతిని అవమానించినట్లే. మన ఎన్.టి.ఆర్ విగ్రహంపై చేయి వేస్తే మన తెలుగు జాతి ఊరుకునేదిలేదు. మేము ఎన్.టి.ఆర్ అభిమానులము అని విర్రవీగే కొందరు వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు నిద్రపోవుచున్నారా ఏమీ. మీకు మా అన్న గారి మీద అభిమానము ఉన్నట్లయితే తక్షణమే దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము" అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



