ENGLISH | TELUGU  

వివేకం మూవీ రివ్యూ

on Aug 24, 2017

సినిమా: వివేకం
తారాగణం: అజిత్, కాజల్, వివేక్ ఓబెరాయ్, అక్షర హాసన్...
దర్శకత్వం : శివ
నిర్మాతలు:  సునీల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, టి.జి.త్యాగరాజన్


కొన్ని సినిమాల విషయంలో తెలుగు, తమిళ ప్రజల అభిరుచులు కలుస్తుంటాయ్. దాంతో రెండు భాషల్లోనూ ఆవి దుమ్ము రేపేస్తుంటాయ్. ఆ విధంగా తమిళం నుంచి అనువాదమై... తెలుగునాట విజయవిహారం చేసిన సినిమాల సంఖ్య చాలా పెద్దదే. రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్, విశాల్, ధనుష్, కార్తీ  సినిమాలకు ఇక్కడ పిచ్చ క్రేజ్ ఉండటానికి కారణం కూడా అదే కదా!. అందుకే తమిళ నిర్మాతలు... వీరి సినిమాలంటే డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుంటారు. సినిమాకు కొబ్బరికాయ కొట్టేటప్పుడే.. ఇది తమిళంతో పాటు తెలుగు సినిమా కూడా అని ముందే ఫిక్సయిపోతుంటారు. ఓవర్సీస్ తో పాటు మూడు రాష్టాల డబ్బులు అప్పనంగా వస్తుంటే.. సినిమాకు డబ్బు విషయంలో వెనుకాడతారా ఏంటి? కానీ డబ్బు వెదజల్లినంత మాత్రాన సినిమాలు ఆడవు కదా. కథ, కథనం బావుండాలి. తెలుగు అభిరుచికి చేరవగా వుండాలి. అలా లేకపోతే.. విస్సిరి కొడతారు చెన్నైకి. అలా శృగభగం అయిన సినిమాలు కూడా ఇక్కడ కోకొల్లలే. 

ఈ గురువారం తెలుగుతెరను ఓ తమిళ అనువాదం పలకరించింది. సినిమా పేరు ‘వివేకం’. హీరో.. అజిత్ కుమార్. దర్శకుడు.. శివ. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను  మెప్పించిందా? లేక నొప్పించిందా? తమిళ సాంబారుకూ, మన గోంగూరకూ ఈ దఫా పొత్తు కుదిరిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ముందు కథలోకెళ్లాలి. 

యాంటీ టెర్రరిజం ఇంటర్నేషనల్ స్క్వాడ్ లో అజయ్ కుమార్... ఉరఫ్ ఏకే(అజిత్) ప్రముఖుడు. ఓ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులతో చేతులు కలిపిందనే అభియోగాలున్న హ్యాకర్ నటాషా(అక్షర హాసన్)ని అతను పట్టుకోవాల్సొస్తుంది. తీరా పట్టుకొన్న తర్వాత నటాషా... ఉగ్రవాదుల చేతుల్లో మోసపోయిన అమాయకురాలని తెలుసుకుంటాడు. దాంతో ఆమెను చంపకుండా.. ఆమె ద్వారా ఉగ్రవాదుల గుట్టు రట్టుచేయడానికి అజయ్ ప్రయత్నిస్తాడు. ఈ ఆపరేషన్లో తన మిత్రుడు, యాంటీ టెర్రరిజం డిపార్టెమెంట్లో సహోద్యోగి అయిన ఆర్యన్(వివేక్ ఓబెరాయ్)... అజయ్ కి సహకరిస్తుంటాడు... కాదు.. సహకరిస్తున్నట్లు నటిస్తుంటాడు. అదను చూసి.. అజయ్ ని అతిదారుణంగా కాల్చి లోయల్లో పడేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? తనకు జరగిన అన్యాయంపై అజయ్ తగిన ప్రతీకారం తీర్చుకున్నాడా? ఉగ్రవాద చర్యలను సమర్థవంతంగా అరికట్టాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.

ఈ కథను శివ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసేలా తీశాడు. యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్. ఇలాంటి కథలకు కథనమే ప్రధానం. ఆ విషయంలో శివ చాలా జాగ్రత్త పడ్డాడు. యాంటీ టెర్రరిజం ఐడియాలజీ విషయంలో పరిశోధన చేసి తీసినట్టు కనిపిస్తుంది. అయితే... హాలీవుడ్ లో ఇలాంటి కథలతో 70ఏళ్ల క్రితం సినిమాలొచ్చాయ్. ఆ తర్వాత... ఇలాంటి నేరపరిశోధనపై వీరపనితం చూపించే కథలు భారతీయ తెరపై కూడా కోకొల్లలు వచ్చేశాయ్. దీన్ని బట్టి... అర్థమైందేంటి? ఇది తాతయ్యలనాటి కథ. పైగా ఎక్కడా లాజిక్కుల్లేవ్. తుపాకీల శబ్దాలతో థియేటర్ మొత్తం హోరెత్తిపోయింది. మరీ సినిమా అంతా కొట్టుకోవడమే అయితే చూసే ప్రేక్షకుడికి సహనపరీక్షే కదా. 

ఈ సినిమా కోసం అజిత్ పడ్డ కష్టాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం. శారీరకంగా తను చాలా ఇబ్బందులు పడ్డాడు. నటన పరంగా కూడా తనదైన స్టయిలిష్ పెర్ ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. వివేక్ ఓబెరాయ్ ఇందులో విలన్. రెండు కోణాలున్న పాత్ర. అజిత్ కి ధీటుగా నటించాడు. కాజల్ అగర్వాల్... మరోసారి హౌస్ వైఫ్ గా కనిపించింది. నేనే రాజు నేనే మంత్రి, వివేకం.. చిత్రాలతో ఆమె ప్రయాణం ఓ కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. చక్కగా చీరలో కనిపిస్తూ, నటనతో మెప్పించింది. ఇందులో అనుకోని మెరుపు కమల్ హాసన్ తనయ అక్షరా హాసన్. కాసేపే కనిపించినా... అద్భుతంగా నటించింది. కమల్ యాక్టింగ్ స్కిల్ అక్షరకు అబ్బిందా.. అనిపిస్తుంది ఆమె నటన చూస్తే.. 

సాంకేతికంగా మాత్రం సినిమా అద్భుతం. సీజీ వర్క్చ, కెమెరా పనితనం వండర్. అనిరుథ్ సంగీతం మాత్రం.. గావు కేకలతో ఇబ్బంది పెట్టింది. టోటల్ గా కథ తక్కువ, వయోలెన్స్ ఎక్కువ. ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు గతంలో ఆదరించింది కూడా తక్కువే. ఎంతో శ్రమకోర్చి, డబ్బును మంచినీళ్ల ప్రాయంగా వెదజల్లి తీసిన ఈ సినిమా ఫలితం ఎలాగుంటుందో తెలియాలంటే... ఓ రెండ్రోజులు ఆగాల్సిదే. 

రేటింగ్: 2.25

ఫైనల్ పంచ్: 
కథ తక్కువ యాక్షన్ ఎక్కువ

 

- ఎన్.బి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.