వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ
on Jul 11, 2025

బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'వర్జిన్ బాయ్స్'. రాజా దారపునేని నిర్మాణంలో దయానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 'టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు' వంటి ప్రమోషనల్ ఆఫర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథ:
ఒక యూనివర్సిటీలో చదువుకునే డుండీ (శ్రీహాన్), ఆర్య (గీతానంద్), రోనీ (రోనీత్ రెడ్డి) స్నేహితులు. కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉండగా, తమకు లేరనే నిరాశలో ఉన్న వీరిని.. వారి స్నేహితుడు (కౌశల్) మరింత రెచ్చగొడతాడు. "నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపు మీరు వర్జినిటీ కోల్పోవాలి" అని సవాల్ విసురుతాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన ముగ్గురు స్నేహితులు.. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. జెనీఫర్ ను డుండీ, సరయు (మిత్రా శర్మ)ను ఆర్య , శ్లోక (అన్షులా ధావన్)ను రోనీ ప్రేమిస్తారు. అయితే, వారి ప్రేమ జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వారి ప్రేమ కథలు విజయ తీరాలకు చేరాయా? వర్జినిటీ కోల్పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ముగ్గురు మిత్రులు తమ సవాల్‌లో గెలిచారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
తెలుగులో అడల్ట్ కామెడీ సినిమా రావడం అరుదు. 'వర్జిన్ బాయ్స్' టైటిల్, ప్రమోషనల్ కంటెంట్ చూసి.. ఇది అడల్ట్ కామెడీ సినిమా అని భావించారంతా. థియేటర్‌లో చూసిన తర్వాత.. ఇది పూర్తిగా అడల్ట్ కామెడీ సినిమా కాదని క్లారిటీ వస్తుంది. కాలేజీలో కొత్తగా చేరిన యువతలో చాలామందికి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని, వర్జినిటీ కోల్పోవాలని కోరిక ఉంటుంది. కానీ, వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే సందేశంతో ఈ సినిమాను రూపొందించారు. అక్కడక్కడ బోల్డ్ జోక్స్, స్కిన్ షో ఉన్నప్పటికీ.. మరీ గీత దాటే ప్రయత్నం చేయలేదు. అయితే సినిమాలో కొత్తదనంలేదు. కథా కథనాలు కూడా గొప్పగా లేవు. తెలిసిన కథ అయినప్పటికీ.. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో బోర్ కొట్టకుండా నడిపే ప్రయత్నం చేశారు. అదే ఈ సినిమాని కాపాడింది. వినోదాన్ని పంచుతూనే.. చివర్లో ఈ తరానికి కావాల్సిన ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
శ్రీహాన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించింది. గీతానంద్ కూడా ఈజ్‌తో నటించాడు. రోనీత్ రెడ్డి తన పాత్రలో పర్వాలేదు అనిపించదు. మిత్రా శర్మ, జెనీఫర్ ఇమ్మానుయేల్, అన్షులా ధావన్ ఆకట్టుకున్నారు.
స్మరణ్ సాయి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా...
'వర్జిన్ బాయ్స్'లో యూత్ కి నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. ఓ మంచి సందేశం కూడా ఉంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా నచ్చే అవకాశముంది.
రేటింగ్: 2.75/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



