మళ్ళీ దొరికిపోయారు.. మూవీ రిలీజ్ పెట్టుకొని అక్కడ రష్మికతో సీక్రెట్ గా విజయ్!
on Apr 4, 2024
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. పైకి విజయ్, రష్మిక తాము స్నేహితులమని చెప్తున్నప్పటికీ.. వారి చర్యలు మాత్రం ప్రేమ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలీదు కానీ.. వారిద్దరూ ఒకే దగ్గర ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చాలాసార్లు లీక్ అయింది.
గతంలో విజయ్, రష్మిక సీక్రెట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళారు. మీడియాకి తెలియకుండా ఉండాలని.. ఎయిర్ పోర్ట్ దగ్గర సెపెరేట్ గా వెళ్లారు. వెకేషన్ ఫొటోలు కూడా సింగిల్ గా వెళ్లినట్లు విడివిడిగా పోస్ట్ చేశారు. అయినప్పటికీ ఆ ఫొటోల్లో ఉన్న లొకేషన్, బ్యాక్ గ్రౌండ్ చూసి ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారని అందరికీ అర్థమైపోయింది. అలాగే దీపావళి సమయంలో విజయ్ తన ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేస్తే, రష్మిక మాత్రం సింగిల్ గా దిగిన ఫొటో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫొటోలను సరిగ్గా గమనిస్తే.. విజయ్ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలెబ్రేట్ చేసుకుందని అర్థమైపోయింది. ఇలా ఇద్దరూ ఒకే సమయంలో విడివిడిగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం.. అందులో ఉన్న లొకేషన్ బట్టి ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారని అర్థమైపోవడం జరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే జరిగింది.
ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. తన బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకోవడం ఆమె అబుదాబి వెళ్ళింది. ఇది నా బర్త్ డే వీక్.. ప్రస్తుతం అబుదాబిలోని సర్ బనియాస్ ఐస్‌ల్యాండ్ లో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో, రెండు ఫొటోలు పంచుకుంది. ముఖ్యంగా "వావ్.. బ్యూటీ" అంటూ ఆమె పంచుకున్న నెమలి ఫొటో ఆకట్టుకుంది. అయితే రష్మిక పోస్ట్ చేసిన కాసేపటికే విజయ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఏప్రిల్ 5న విజయ్ నటించిన 'ఫ్యామిలీ స్టార్' విడుదల కానుంది. యూఎస్ లో ఏప్రిల్ 4 నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో 'గీత గోవిందం' లాంటి సినిమాతో మళ్ళీ మ్యాజిక్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాం అంటూ యూఎస్ ప్రేక్షకుల కోసం ఓ వీడియో బైట్ చేశాడు విజయ్. ఆ వీడియోలో విజయ్ ఉన్న లొకేషన్, అతని వెనకున్న నెమలిని గమనిస్తే.. రష్మిక, విజయ్ ఒకే దగ్గర ఉన్నారని అర్థమవుతోంది. దీంతో ఏప్రిల్ 5న తన సినిమా రిలీజ్ పెట్టుకొని కూడా.. అదేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రష్మిక కోసం విజయ్ అబుదాబి వెళ్లాడన్న వార్తతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.